Venkitaramanan: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ కన్నుమూత
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ ఎస్.వెంకటరమణన్ శనివారం కన్నుమూశారు. ఆయనకు ఇప్పుడు 92ఏళ్లు. ఆర్‌బీఐకి 18వ గవర్నర్‌గా ఎస్.వెంకటరమణన్ పనిచేశారు. వయసు సంబంధిత అనారోగ్యంతో ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎస్.వెంకటరమణన్ డిసెంబర్ 1990 నుంచి డిసెంబర్ 1992 వరకు గవర్నర్‌గా సేవలు అందించారు. 1985 నుంచి 1989 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక కార్యదర్శి, కర్ణాటక ప్రభుత్వానికి సలహాదారుగా కూడా ఉన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఫారిన్ ఎక్స్ఛేంజ్ నిల్వలు వేగంగా క్షీణించడం ద్వారా భారతదేశం ఎదర్కొన్న సంక్షోభాన్ని ఆయన ఎదుర్కొన్నారు. నిర్ణయాత్మక చర్యల ద్వారా ఆయన సంక్షోభాన్ని గట్టేక్కించారు.
చెన్నైలో చికిత్స పొందుతూ మృతి
కేరళలోని ట్రావెన్‌కోర్ సంస్థానంలో జననం
వెంకిటరమణన్ పదవీ విరమణ తర్వాత అశోక్ లేలాండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, న్యూ తిరుపూర్ ఏరియా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అశోక్ లేలాండ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా కీలక పాత్రలు పోషించారు. వెంకటరమణన్ ట్రావెన్‌కోర్ సంస్థానంలో పద్మనాథపురం డివిజన్‌లో భాగమైన నాగర్‌కోయిల్‌లో తమిళ అయ్యర్ కుటుంబంలో జన్మించారు. అతను కేరళలోని యూనివర్శిటీ కాలేజ్ తిరువనంతపురం నుంచి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించారు. వెంకటరమణన్‌కు గిరిజ, సుధ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.