Crude Oil: హర్మూజ్ ఉద్రిక్తతలు.. 180 డాలర్ల దిశగా చమురు ధర: సౌదీ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఇంధన క్షేత్రాలు లక్ష్యంగా మారుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద ఏర్పడుతున్న అంతరాయాలు ప్రపంచ చమురు మార్కెట్లలో ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే చమురు సరఫరాపై భయాలు నెలకొన్న నేపథ్యంలో తాజా దాడులు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. జలసంధిలో నౌకల రాకపోకలు ఏప్రిల్ చివరివరకు ఇదే విధంగా నిలిచిపోతే,ఒక బ్యారెల్ చమురు ధర 180 డాలర్ల వరకు చేరే అవకాశముందని సౌదీ అరేబియా అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
వివరాలు
యుద్ధ ప్రభావం: క్రూడ్ ఆయిల్ ధరల ఎగిసిపాటు
ఫిబ్రవరి 28న ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 70 డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం అది ఒక్క దశలో 119 డాలర్లకు చేరుకుంది. ఈ పరిణామాలపై స్పందించిన సౌదీ విదేశాంగ నిపుణుడు ఉమర్ కరీం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్ర సముద్రంలోని చమురు టెర్మినళ్లపై దాడులు జరిగి, రవాణాలో అంతరాయం ఏర్పడితే ముడి చమురు ధర 150 డాలర్లను కూడా దాటే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ప్రత్యామ్నాయ మార్గాల వైపు గల్ఫ్ దేశాలు
హర్మూజ్ జలసంధిలో సమస్యలు కొనసాగుతుండటంతో గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియా ఎర్ర సముద్రం మార్గంగా చమురు ఎగుమతులను పెంచుతోంది. అయితే, యాన్బు పోర్టు సమీపంలోని అరామ్‌కో రిఫైనరీపై డ్రోన్ దాడి జరగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. ఇప్పటికే హర్మూజ్ వద్ద అంతరాయాలు కొనసాగుతుండగా, ఎర్ర సముద్రంలోని టెర్మినళ్లపై కూడా దాడులు జరిగితే ప్రపంచ చమురు సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.