Saudi Arabia: ఇరాన్ యుద్ధ ప్రభావం.. ఎర్ర సముద్రం మార్గంలో సౌదీ చమురు ఎగుమతులు పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో దశాబ్దాలుగా ప్రపంచ ఇంధన రవాణాలో కీలకంగా ఉన్న మార్గాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి ప్రభావంతో గల్ఫ్ దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ఎర్ర సముద్రం మార్గం ద్వారా చమురు ఎగుమతులను పెంచుతోంది. ప్రస్తుతం నెలకొన్న అంతరాయాల సమయంలో సౌదీ అరేబియాకు చెందిన 'పెట్రోలైన్'అంటే ఈస్ట్-వెస్ట్ క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్ నెట్‌వర్క్ ఇంధన రవాణాలో అత్యంత కీలకంగా మారింది. పర్షియన్ గల్ఫ్ పరిధిలోని ఉత్పత్తి కేంద్రాల నుంచి ఎర్ర సముద్ర తీరంలోని టర్మినళ్ల వరకు ఈ పైప్‌లైన్ ద్వారా చమురు సరఫరా జరుగుతోంది. దీంతో హర్మూజ్ జలసంధి మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతోంది.
వివరాలు
ఈస్ట్-వెస్ట్ క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్ దాదాపు 1,200 కిలోమీటర్ల పొడవు
సౌదీ అరేబియా అంతటా విస్తరించిన ఈ ఈస్ట్-వెస్ట్ క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్ దాదాపు 1,200 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. దేశంలోని ప్రధాన చమురు ప్రాసెసింగ్ కేంద్రాలను ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు పోర్టు నగరంతో ఇది అనుసంధానిస్తుంది. ఈ మార్గం ద్వారా చమురు నేరుగా అంతర్జాతీయ మార్కెట్లకు చేరుతోంది. అందుకే ఈ నెట్‌వర్క్‌ను 'పెట్రోలైన్'గా పిలుస్తున్నారు.ఈ కీలక పైప్‌లైన్ ప్రాజెక్టుకు 1981లోనే శ్రీకారం చుట్టారు.
వివరాలు
ఈ ఏడాది చివరికి ఈ లైన్ రోజుకు 7 మిలియన్ల బ్యారెళ్ల చమురు
ఇరాన్-ఇరాక్ యుద్ధ కాలంలో సౌదీ అరేబియా తొలి లైన్‌ను పూర్తి చేసింది. సముద్ర మార్గాల్లో ఘర్షణలు, అంతరాయాలు తలెత్తే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, వాటికి ప్రత్యామ్నాయంగా భూమార్గాల ద్వారా చమురు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ పైప్‌లైన్‌ను దశలవారీగా విస్తరించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈ ఏడాది చివరికి ఈ లైన్ రోజుకు 7 మిలియన్ల బ్యారెళ్ల చమురు రవాణా సామర్థ్యాన్ని చేరుకునే అవకాశం ఉంది.