LOADING...
SBI : రూ.19,684 కోట్ల లాభం నమోదు చేసిన ఎస్‌బీఐ.. కానీ షేర్లు పడిపోవడానికి కారణమిదే?
రూ.19,684 కోట్ల లాభం నమోదు చేసిన ఎస్‌బీఐ.. కానీ షేర్లు పడిపోవడానికి కారణమిదే?

SBI : రూ.19,684 కోట్ల లాభం నమోదు చేసిన ఎస్‌బీఐ.. కానీ షేర్లు పడిపోవడానికి కారణమిదే?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2026
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ (SBI) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు ఒకవైపు భారీ లాభాలను చూపించినప్పటికీ, మరోవైపు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడంతో పెట్టుబడిదారుల్లో నిరాశ నెలకొంది. దాంతో స్టాక్ మార్కెట్‌లో ఎస్‌బీఐ షేర్లపై తీవ్ర ఒత్తిడి కనిపించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ స్టాండ్‌అలోన్ నికర లాభం 5.6 శాతం పెరిగి రూ.19,684 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది మెరుగైన ఫలితమే అయినప్పటికీ, మార్కెట్ విశ్లేషకులు రూ.20,312 కోట్లకు పైగా లాభం నమోదవుతుందని అంచనా వేశారు. దీంతో ప్రకటించిన ఫలితాలు పెట్టుబడిదారుల ఆశించిన స్థాయికి చేరలేదు.

వివరాలు

దలాల్ స్ట్రీట్‌లో ప్రతికూల స్పందన

బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) కూడా 4.1శాతం పెరిగి రూ.44,380కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.42,618 కోట్లుగా నమోదైంది. అయితే ఈ వృద్ధి కూడా మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడంతో దలాల్ స్ట్రీట్‌లో ప్రతికూల స్పందన కనిపించింది. ఈ ప్రభావం నేరుగా స్టాక్‌పై పడింది. ట్రేడింగ్ సమయంలో ఎస్‌బీఐ షేరు దాదాపు 5 శాతం వరకు పడిపోయి రూ.1,037.5 వద్ద ట్రేడ్ అయింది. ఫలితాల అనంతరం భారీ ర్యాలీ వస్తుందని భావించిన ఇన్వెస్టర్లకు ఇది ఊహించని షాక్‌గా మారింది. అయితే వాటాదారులకు ఊరటనిచ్చేలా బ్యాంక్ ఒక్కో షేరుకు రూ.17.35 డివిడెండ్ ప్రకటించింది. మే 16, 2026 నాటికి షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు ఈ డివిడెండ్‌కు అర్హులు కానున్నారు.

వివరాలు

లాభాలతో కొంత ఉపశమనం

జూన్ 4, 2026న ఈ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఆస్తుల నాణ్యత పరంగా మాత్రం బ్యాంక్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) 1.57 శాతం నుంచి 1.49 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పిఏలు (NNPA) 0.39 శాతంలోనే స్థిరంగా కొనసాగాయి. మొత్తంగా స్థూల ఎన్‌పిఏలు రూ.73,452.5 కోట్లకు తగ్గడం బ్యాంక్ రుణాల నాణ్యత మెరుగుపడుతున్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రొవిజనింగ్ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ.6,441 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం రూ.2,872 కోట్లు మాత్రమే కేటాయించింది. దీని వల్ల బ్యాంక్ లాభాలకు కొంత మద్దతు లభించింది.

Advertisement

వివరాలు

భారీగా పడిపోయిన ఆదాయం

అయితే ట్రెజరీ కార్యకలాపాల ఆదాయం భారీగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది రూ.8,991 కోట్లుగా ఉన్న ట్రెజరీ ఆదాయం ఈసారి కేవలం రూ.1,259 కోట్లకు పడిపోయింది. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ కారణంగా బ్యాంకుల వద్ద ఉన్న బాండ్ల విలువ తగ్గడమే దీనికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదనంగా ఇతర ఆదాయం కూడా సుమారు 29 శాతం తగ్గి రూ.17,314 కోట్లకు చేరింది. మొత్తంగా చూస్తే ఎస్‌బీఐ లాభాల్లో వృద్ధి కనిపించినప్పటికీ, మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడం, ట్రెజరీ ఆదాయం పడిపోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను నిరాశకు గురి చేశాయి.

Advertisement