LOADING...
SBI Q2 Results: త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన ఎస్‌బీఐ.. రూ.20,160 కోట్ల లాభం!
త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన ఎస్‌బీఐ.. రూ.20,160 కోట్ల లాభం!

SBI Q2 Results: త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన ఎస్‌బీఐ.. రూ.20,160 కోట్ల లాభం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 04, 2025
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)త్రైమాసిక ఫలితాల్లో మరోసారి తన సత్తా చాటుకుంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (Q2) ఈ బ్యాంకు రూ.20,160 కోట్ల నికర లాభం సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.18,331 కోట్లుగా ఉండగా, ఈసారి దాదాపు 10 శాతం వృద్ధి నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో ఎస్‌బీఐ మొత్తం ఆదాయం రూ.1,29,141 కోట్ల నుంచి రూ.1,34,979 కోట్లకు పెరిగింది. అందులో వడ్డీ ఆదాయం రూ.1,13,871 కోట్ల నుంచి రూ.1,19,654 కోట్లకు పెరిగినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. బ్యాంకు ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. సెప్టెంబర్‌ 30 నాటికి స్థూల నిరర్థక ఆస్తులు(Gross NPAs)గతేడాది 2.13 శాతం ఉండగా, ఈసారి 1.73 శాతానికి తగ్గాయి.

Details

నిఖర మొండి బకాయిలు తగ్గింపు

అలాగే నికర మొండి బాకీలు (Net NPAs) 0.53 శాతం నుంచి 0.42 శాతానికి తగ్గుముఖం పట్టాయి, ఇది బ్యాంకు ఆర్థిక బలాన్ని సూచిస్తోంది. ఏకీకృత ప్రాతిపదికన (Consolidated basis) ఎస్‌బీఐ గ్రూప్‌ రూ.21,137 కోట్ల నికర లాభం నమోదు చేసింది. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 7 శాతం వృద్ధి. అప్పుడు ఈ మొత్తం రూ.19,743 కోట్లుగా ఉంది. అదే సమయంలో మొత్తం ఆదాయం రూ.1.63 లక్షల కోట్ల నుంచి రూ.1.75 లక్షల కోట్లకు పెరిగింది. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో ఎన్‌ఎస్‌ఈ (NSE)లో ఎస్‌బీఐ షేర్లు స్వల్ప లాభంతో రూ.957 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఫలితాలతో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగంలో ఎస్‌బీఐ తన ఆధిపత్యాన్ని మరింత బలపరచింది.