LOADING...
Avadhut Sathe: ఫిన్‌ఫ్లూయెన్సర్ అవధూత్‌పై సెబీ నిషేధం..రూ.546 కోట్లు జప్తుకు ఆదేశాలు.. ఎవరీ ఫిన్‌ఫ్లూయెన్సర్‌ అవధూత్‌..? 
ఎవరీ ఫిన్‌ఫ్లూయెన్సర్‌ అవధూత్‌..?

Avadhut Sathe: ఫిన్‌ఫ్లూయెన్సర్ అవధూత్‌పై సెబీ నిషేధం..రూ.546 కోట్లు జప్తుకు ఆదేశాలు.. ఎవరీ ఫిన్‌ఫ్లూయెన్సర్‌ అవధూత్‌..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిన్‌ఫ్లూయెన్సర్ల కార్యకలాపాలను నియంత్రించే దిశగా సెబీ (SEBI) గట్టి చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఆర్థిక ఇన్‌ఫ్లూయెన్సర్, మార్కెట్ ట్రైనర్‌గా గుర్తింపు పొందిన అవధూత్ సాఠేపై నిషేధం విధించింది. ఆయన నిర్వహిస్తున్న అవధూత్ సాఠే ట్రేడింగ్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నమోదు లేకుండా పెట్టుబడులపై సలహాలు అందిస్తూ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించింది. ఈ నిర్ణయంతో అవధూత్ సెక్యూరిటీ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనడం నిషిద్ధమైంది. అంతేకాదు, ఆయనకు సంబంధించిన రూ.546 కోట్ల ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ పేరిట షేర్ మార్కెట్ ట్రేడింగ్‌ గురించి అవధూత్ సలహాలు ఇచ్చేవారని సెబీ గమనించింది.

వివరాలు 

ఎవరీ అవధూత్ సాఠే? 

అవసరమైన నియంత్రణ అనుమతులు లేకుండానే స్టాక్స్‌పై ఆన్‌లైన్‌లో మార్గనిర్దేశం చేస్తున్న వారిపై నిఘా పెట్టిన సెబీ, ఆయన కార్యకలాపాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో గత ఆగస్టులో ఆయన నివాసం, అకాడమీ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. ముంబైలోని దాదర్ ప్రాంతానికి చెందిన అవధూత్ సాఠే ఇంజినీరింగ్ చదివారు. సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికాల్లో ఐటీ రంగంలో పనిచేశారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 1991 నుంచే ట్రేడింగ్ ప్రారంభించిన ఆయన, 2007లో భారత్‌కు తిరిగి వచ్చి పూర్తిగా షేర్ మార్కెట్‌పై దృష్టి పెట్టారు. తదనంతరం 2008లో అవధూత్ సాఠే ట్రేడింగ్ అకాడమీని స్థాపించారు.

వివరాలు 

మూడు నెలల శిక్షణకు రూ.21 వేల నుండి రూ.1.7 లక్షల వరకు ఫీజు

సాంకేతిక విశ్లేషణ, మానసిక శిక్షణ (సైకాలజీ), యోగా, ప్రేరణాత్మక సెషన్లను మిళితం చేస్తూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ఆయన ప్రత్యేకతగా గుర్తింపు పొందింది. ఇవి దేశంలోనే కాక విదేశాల్లో కూడా మంచి ఆదరణ పొందాయి. యూట్యూబ్ ద్వారా లక్షల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించారు. మూడు నెలల శిక్షణకు రూ.21 వేల నుండి రూ.1.7 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తుంటారని కథనాలు చెబుతున్నాయి. ట్రేడింగ్ సెషన్ మధ్యలో డ్యాన్స్ చేస్తూ కనిపించే వీడియో ఒకటి 2023లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన శిష్యులు సాధించిన విజయాలను అకాడమీ తరచుగా ప్రచారం చేయడంతో ప్రజాదరణ మరింత పెరిగింది.

Advertisement

వివరాలు 

ఫిన్‌ఫ్లూయెన్సర్ల నుంచి కూడా ఆయనపై విమర్శలు

అవధూత్ అకాడమీ ద్వారా 3.37 లక్షల మంది ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.601 కోట్లు సేకరించారని సెబీ గుర్తించింది. ట్రేడింగ్ కోర్సులు మాత్రమే కాకుండా, లైవ్ మార్కెట్ సెషన్లలో ఏ షేర్లు కొనాలి, ఎప్పుడు విక్రయించాలి అన్న విషయాలపై కూడా ప్రత్యక్షంగా సలహాలు ఇస్తున్నారని వెల్లడించింది. ఇది నియమాలకు విరుద్ధమని పేర్కొంది. ఇతర ఫిన్‌ఫ్లూయెన్సర్ల నుంచి కూడా ఆయనపై విమర్శలు వచ్చాయి. రిటైల్ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించే విధానాలు అవలంబిస్తున్నారని, సందేహాస్పదమైన ట్రేడింగ్ వ్యూహాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ప్రైవేట్ గ్రూపుల్లో స్టాక్ చిట్కాలు పంపుతూ, అనుభవం లేని ట్రేడర్లపై ప్రభావం చూపుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.

Advertisement

వివరాలు 

2025 నాటికి ఈ ఆదాయం రూ.200 కోట్లు దాటొచ్చని అంచనాలు

అదేవిధంగా అవధూత్ ట్రైనింగ్ వ్యాపారంలో వచ్చిన వేగవంతమైన వృద్ధి కూడా సెబీ దృష్టిని ఆకర్షించింది. 2021లో ఆయనకు ఫీజుల రూపంలో రూ.17 కోట్లు ఆదాయం వస్తే, 2023 నాటికి అది రూ.86 కోట్లకు చేరింది. 2025 నాటికి ఈ ఆదాయం రూ.200 కోట్లు దాటొచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నమోదు కాని సంస్థగా పనిచేస్తున్న అవధూత్ సాఠే సంస్థపై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. ఆయనకు సంబంధించిన రూ.546 కోట్ల విలువైన ఆస్తులను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వరకు ఫ్రీజ్ చేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement