SEBI: కిరాణా షాపు నడుపుతున్న 'రిసెర్చ్ అనలిస్టు'.. షాకైన సెబీ
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ సెక్యూరిటీస్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI)ను కూడా ఆశ్చర్యానికి గురిచేసిన ఓ విచిత్ర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రీసెర్చ్ అనలిస్టుగా నమోదు అయి ఉన్న వ్యక్తి వాస్తవానికి షేర్ మార్కెట్‌తో ఎలాంటి సంబంధం లేకుండా మదురైలో కేవలం 100 చదరపు అడుగుల చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నట్టు సెబీ గుర్తించింది. దీంతో ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్‌ను సెబీ రద్దు చేసింది. పురూస్కాన్ అనే వ్యక్తి అధికారికంగా సెబీలో రీసెర్చ్ అనలిస్టుగా నమోదయ్యాడు. కానీ విచారణలో అతడు మార్కెట్ విశ్లేషణలు లేదా పెట్టుబడి సలహాలు ఇవ్వడం కాకుండా, రోజువారీ సరుకులు, స్నాక్స్,కిరాణా వస్తువులు విక్రయిస్తున్నట్టు బయటపడింది.
వివరాలు
చిన్న కిరాణా దుకాణం నడుపుతున్న రీసెర్చ్ అనలిస్టు
అసలు ఇలాంటి వ్యక్తికి సెబీ రిజిస్ట్రేషన్ ఎలా వచ్చిందో తనకే అర్థం కావడం లేదని కేసు చూసిన క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ కేసులో సెబీ క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ సంతోష్ కుమార్ శుక్లా తన ఉత్తర్వుల్లో మాట్లాడుతూ, "వర్చువల్ హియరింగ్ సమయంలో నోటీసీకి సెక్యూరిటీస్ మార్కెట్ కార్యకలాపాలపై ఎలాంటి అవగాహన లేదని స్పష్టమైంది. అతడు చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఇలాంటి వ్యక్తి రీసెర్చ్ అనలిస్టుగా ఎలా రిజిస్ట్రేషన్ పొందాడో అర్థం కావడం లేదు" అని పేర్కొన్నారు. అలాగే, "తాను చిన్న వ్యాపారం చేస్తున్నానని,ఎలాంటి రీసెర్చ్ అనలిస్టు కార్యకలాపాలు చేయడం లేదని నోటీసీ స్వయంగా అంగీకరించాడు"అని శుక్లా తెలిపారు.
వివరాలు
రూ.4 లక్షల నష్టం
ఈ వివరాల ఆధారంగా సెబీ పురూస్కాన్ రీసెర్చ్ అనలిస్టు రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా రద్దు చేసింది. ఈ వ్యవహారం 2022 జూన్‌లో సెబీకి వచ్చిన ఓ ఫిర్యాదుతో మొదలైంది. సెబీ SCORES ప్లాట్‌ఫామ్‌లో www.optionresearch.in అనే వెబ్‌సైట్‌పై ఫిర్యాదు నమోదైంది. ఆ వెబ్‌సైట్ 'ష్యూర్ షాట్' ట్రేడింగ్ కాల్స్, సున్నా రిస్క్, పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ హామీలు ఇచ్చింది. ఫిర్యాదుదారు రూ.50,000 ఫీజు చెల్లించి సేవలు పొందగా, చివరకు సుమారు రూ.4 లక్షల నష్టం చవిచూశాడు. ఫిర్యాదు ఆధారంగా సెబీ విచారణ ప్రారంభించి పురూస్కాన్‌కు నోటీసులు జారీ చేసింది.
వివరాలు
సైబర్ సెల్‌కు ఆన్‌లైన్ ఆర్థిక మోసంగా ఫిర్యాదు
తన సెబీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను దుర్వినియోగం చేశారని, ఆ వెబ్‌సైట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అతడు చెప్పాడు. Option Research Consultancyపై 2022 సెప్టెంబర్ 27న తమిళనాడు పోలీసులకు, అలాగే అక్టోబర్ 11న సైబర్ సెల్‌కు ఆన్‌లైన్ ఆర్థిక మోసంగా ఫిర్యాదు చేసినట్లు పత్రాలు కూడా సమర్పించాడు. అయితే Option Research Company (ORC) వెబ్‌సైట్‌లో పలు చెల్లింపు పెట్టుబడి సలహా ప్యాకేజీలు ఉన్నాయని, తాము సెబీ సర్టిఫైడ్ సంస్థమని ప్రచారం చేస్తూ పురూస్కాన్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను బహిరంగంగా చూపిస్తున్నట్టు సెబీ గమనించింది. పురూస్కాన్ అనుమతితోనే ORC అతని రిజిస్ట్రేషన్ వివరాలు ఉపయోగించిందని, ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ కూడా పంచుకున్నాడని సెబీ షోకాజ్ నోటీసులో ఆరోపించింది.
వివరాలు
ఆ ఆఫర్‌ను తిరస్కరించా..
తర్వాత పురూస్కాన్ వివరణ ఇస్తూ, ORC భాగస్వాముల్లో ఒకరైన జీ ఫహీత్ అలీ తనను బ్యాంక్ ఉద్యోగిగా పరిచయం చేసుకుని, రీసెర్చ్ అనలిస్టు ఖాళీ ఉందని చెప్పి సర్టిఫికెట్లు, వ్యక్తిగత వివరాల ఫోటోకాపీలు తీసుకున్నాడని తెలిపాడు. అవే తర్వాత దుర్వినియోగం అయ్యాయని వాదించాడు. సెబీ విచారణ మొదలైన తర్వాత ORC తనకు అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చి, కంప్లయన్స్ ఆఫీసర్‌గా, ట్రేడింగ్ కాల్స్ ఇవ్వడానికి అధికారం ఇచ్చిందని, అయితే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పాడు.
వివరాలు
సెబీ కఠిన నిర్ణయం
గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇదే కేసులో గతంలో అడ్జుడికేటింగ్ ఆఫీసర్ పురూస్కాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చి, ఎలాంటి జరిమానా విధించకుండా కేసును మూసివేశారు. అయితే గత ఏడాది ఆగస్టులో మరో ఉత్తర్వులో రూ.30.39 లక్షలు రిఫండ్ చేయాలని, రెండేళ్లపాటు సెక్యూరిటీస్ మార్కెట్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. సంబంధిత సంస్థలపై ఒక్కొక్కటికి రూ.6 లక్షల జరిమానా కూడా విధించారు. ఈసారి మాత్రం సెబీ కఠిన నిర్ణయం తీసుకుంది. రీసెర్చ్ అనలిస్టు రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా రద్దు చేస్తూ, 'కిరాణా షాపు రీసెర్చ్ అనలిస్టు' అనే ఈ వింత ఘటనకు ముగింపు పలికింది.