SEBI Chief Madhabi Puri Buch: సెబీ చీఫ్ మధబి పూరీ బుచ్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్ మధబి పూరీ బుచ్‌పై కాంగ్రెస్ పార్టీ తాజాగా తీవ్ర ఆరోపణలు చేసింది. సెబీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆమె యాజమాన్యంలోని అగోరా అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి సంపాదించడం కొనసాగించిందని కాంగ్రెస్ పేర్కొంది. అగోరా ప్రైవేట్ లిమిటెడ్ 2013 మే 7న రిజిస్టర్ చేశారు. ఈ సంస్థ మధబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ ల యాజమాన్యంలో ఉంది.
ప్రముఖ సంస్థలకు సేవలందించారన్న కాంగ్రెస్
హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత, మధబి పూరీ బుచ్ ఈ సంస్థ యాజమాన్యంలో కొనసాగడం లేదని చెప్పారు. కానీ, తాజా ఆరోపణల ప్రకారం, ఆమె 99శాతం వాటా ఇంకా కలిగి ఉన్నారని, ఆమె సంస్థ ద్వారా 'M&M', 'డాక్టర్ రెడ్డీస్' వంటి ప్రముఖ సంస్థలకు సలహా సేవలు అందించారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు సెబీ చీఫ్ మధబి పూరీ బుచ్ మీద తీవ్రమైన విమర్శలకు దారితీశాయి.