SEBI: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు.. రూల్స్ మార్చిన సెబీ!
ఈ వార్తాకథనం ఏంటి
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు మరింత లాభం చేకూర్చే దిశగా సెబీ (సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కీలకమైన మార్పులు చేసింది. ఈకొత్త నిబంధనలతో తొలిసారిగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడిలో ఫండ్ మేనేజర్లకు ఎంత మొత్తం వెళ్తోంది,బ్రోకర్లకు ఎంత చెల్లిస్తున్నారు,పన్నుల రూపంలో ఎంత కట్ అవుతోందనే వివరాలను స్పష్టంగా తెలుసుకునే అవకాశం కలగనుంది. ఇంతవరకు మొత్తం ఖర్చు నిష్పత్తి (టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో-TER)ఒకే సమగ్ర సంఖ్యగా ఉండేది. ఇందులో ఫండ్ మేనేజ్‌మెంట్ ఫీజులు,బ్రోకరేజ్,సెబీ ఫీజులు,జీఎస్టీతో పాటు ఇతర ఖర్చులు అన్నీ కలిసే ఉండేవి. ఫలితంగా,పెట్టుబడిదారుడిగా మీరు చెల్లించిన మొత్తం ఖర్చులో ఎంత భాగం ఫండ్ హౌస్‌కు వెళ్లింది, ఎంత పన్నులు లేదా ట్రేడింగ్ ఖర్చులుగా ఖర్చైంది అనే విషయం ఇంతకుముందు స్పష్టంగా తెలిసేది కాదు.
వివరాలు
సెబీ కొత్త విధానంతో ఖర్చులను విడిగా చూపించాలి
ఇప్పుడు సెబీ కొత్త విధానంతో ఖర్చులను విడిగా చూపించాల్సి ఉంటుంది. అందులో.. బేస్ ఎక్స్‌పెన్స్ రేషియో (BER): మీ పెట్టుబడిని నిర్వహించడానికి ఫండ్ హౌస్ తీసుకునే స్వంత ఫీజును ఇది ప్రతిబింబిస్తుంది. బ్రోకరేజ్, లావాదేవీ ఖర్చులు సెబీ, ఎక్స్చేంజ్ ఫీజులు వంటి నియంత్రణా సుంకాలు జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, ఇతర పన్నులు వంటి చట్టబద్ధమైన సుంకాలు ఈ విభజనతో, మీరు చెల్లించే ఖర్చులో AMC (ఆసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ) మార్జిన్ ఎంత, తప్పనిసరిగా చెల్లించాల్సిన నియంత్రణా వ్యయాలు ఎంత అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు, సెబీ అనేక ఫండ్ వర్గాల్లో BERపై ఉన్న గరిష్ట పరిమితులను కూడా తగ్గించింది.
వివరాలు
ఫండ్ రకాలవారీగా తగ్గిన వ్యయ పరిమితులు
ఇండెక్స్ ఫండ్స్ మరియు ETFలలో BER గరిష్ట పరిమితిని మునుపటి 1 శాతం నుంచి 0.9 శాతానికి తగ్గించారు. ఈక్విటీ ఆధారిత ఫండ్-ఆఫ్-ఫండ్స్‌లో ఈ పరిమితి 2.25 శాతం నుంచి 2.10 శాతానికి తగ్గింది. ఇతర ఫండ్-ఆఫ్-ఫండ్స్‌లో 2 శాతం నుంచి 1.85 శాతానికి తగ్గించారు. ఈక్విటీ క్లోజ్-ఎండ్ ఫండ్స్‌కు 1.25 శాతం నుంచి 1 శాతం వరకే అనుమతించారు. నాన్-ఈక్విటీ క్లోజ్-ఎండ్ ఫండ్స్‌లో 1 శాతం నుంచి 0.8 శాతానికి పరిమితం చేశారు.
వివరాలు
బ్రోకరేజ్‌పై ఉన్న పరిమితులుకూడా మరింత కఠినతరం
అలాగే, బ్రోకరేజ్‌పై ఉన్న పరిమితులను కూడా మరింత కఠినతరం చేశారు. నగదు మార్కెట్ ట్రేడ్లలో గతంలో 8.59 బేసిస్ పాయింట్లుగా ఉన్న పరిమితిని ఇప్పుడు 6 బేసిస్ పాయింట్లకు తగ్గించారు. ఉత్పన్నాల (డెరివేటివ్స్) ట్రేడింగ్ ఖర్చులు సుమారు 4 బేసిస్ పాయింట్ల నుంచి 2 బేసిస్ పాయింట్లకు పరిమితం అయ్యాయి. అదనంగా, ఎగ్జిట్ లోడ్ ఉన్న పథకాలపై ఇచ్చే అదనపు బఫర్‌ను కూడా పూర్తిగా తొలగించారు.