Loading...
SEBI: అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమీకి సెబీ షాక్.. రూ.11.5 కోట్ల జరిమానా
అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమీకి సెబీ షాక్.. రూ.11.5 కోట్ల జరిమానా

SEBI: అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమీకి సెబీ షాక్.. రూ.11.5 కోట్ల జరిమానా

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2026
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI)అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ (ASTPL), దాని వ్యవస్థాపకుడు అవధూత్ సాథేకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ లేకుండా పెట్టుబడి సలహాలు,రీసెర్చ్ అనలిస్ట్ సేవలు అందించడం ద్వారా వసూలు చేసిన రూ.546.17 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. దీనికి అదనంగా రూ.67.87 కోట్ల వడ్డీని సెబీ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్(IPEF)లో జమ చేయాలని స్పష్టం చేసింది. శుక్రవారం జారీ చేసిన తుది ఉత్తర్వుల ప్రకారం.. అకాడమీ, అవధూత్ సాథేలు రెండేళ్లపాటు లేదా పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి చెల్లించే ఆదేశాలను అమలు చేసే వరకు,ఈ రెండింటిలో ఏది ఆలస్యమైతే అప్పటివరకు స్టాక్ మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహించకుండా సెబీ నిషేధం విధించింది.

వివరాలు 

జరిమానాలు, రీఫండ్‌కు సెబీ గడువు..

అకాడమీ డైరెక్టర్ గౌరి అవధూత్ సాథేపై ఆరు నెలలపాటు మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది.

అకాడమీ,అవధూత్ సాథే, గౌరి సాథేలపై కలిపి రూ.11.5 కోట్ల జరిమానా విధించింది.

ఇందులో అకాడమీకి రూ.6 కోట్లు, అవధూత్ సాథేకు రూ.4 కోట్లు,గౌరి సాథేకు రూ.1.5 కోట్ల జరిమానా విధించింది.

ఉత్తర్వులు అందిన 45 రోజుల్లోగా ఈ జరిమానాలను చెల్లించాలని ఆదేశించింది.

రూ.546.17 కోట్లను రీఫండ్‌ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు అకాడమీ,దాని వ్యవస్థాపకుడికి ఐదు నెలల గడువు ఇచ్చింది.

అలాగే,ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోగా ఇంగ్లిష్, హిందీ జాతీయ వార్తాపత్రికలతోపాటు ఎక్కువ మంది చదివే స్థానిక భాషా పత్రికలో ప్రకటనలు ఇవ్వాలి.

వివరాలు 

బ్యాంకు ఖాతాలు, ఆస్తులపై సెబీ ఆంక్షలు

అర్హులైన పెట్టుబడిదారులు, శిక్షణలో పాల్గొన్నవారు తమ డబ్బును ఎలా తిరిగి పొందవచ్చో ఆ ప్రకటనల్లో వివరించాలి.

డబ్బు వాపసు ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని సెబీకి అప్పగించాలి.

ఆ మొత్తాన్ని ఏడాది పాటు ఎస్క్రో ఖాతాలో ఉంచి,పెట్టుబడి సలహాలు లేదా రీసెర్చ్ సేవలు పొందిన ఖాతాదారులు, ఫిర్యాదుదారులు,పెట్టుబడిదారులకు పంపిణీ చేయాలి.

ఏడాది తర్వాత కూడా ఏదైనా మొత్తం మిగిలితే దాన్ని సెబీ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్‌లో జమ చేయాలి.

అవసరమైన మొత్తాలను జమ చేసే వరకు అకాడమీ,అవధూత్ సాథేల బ్యాంకు ఖాతాల నుంచి నగదు డెబిట్‌లపై సెబీ ఆంక్షలు విధించింది.

రీఫండ్ ఆదేశాలను అమలు చేయడం మినహా ఇతర అవసరాల కోసం తమ ఆస్తులను విక్రయించకూడదని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

రిజిస్ట్రేషన్ లేకుండా స్టాక్ మార్కెట్ సలహాలు..  

ఇందులో షేర్లు,మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు కూడా ఉన్నాయి.

అకాడమీ, అవధూత్ సాథే, గౌరి సాథేలు రిజిస్ట్రేషన్ లేకుండా పెట్టుబడి సలహాలు,రీసెర్చ్ అనలిస్ట్ సేవలు అందించడాన్ని వెంటనే నిలిపివేయాలని సెబీ ఆదేశించింది.

నిర్దిష్ట షేర్ల భవిష్యత్ ధరల కదలికలను అంచనా వేయడానికి దిశానిర్దేశం చేసే లైవ్ లేదా గత మార్కెట్ డేటాను ఉపయోగించడంపైనా నిషేధం విధించింది.

2017 జులై 1 నుంచి 2025 అక్టోబర్ 9 వరకు జరిగిన కార్యకలాపాలపై సెబీ విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా అకాడమీ, దాని వ్యవస్థాపకుడు కేవలం స్టాక్ మార్కెట్ విద్యకే పరిమితం కాకుండా నిర్దిష్ట షేర్లపై సలహాలు ఇచ్చినట్లు సెబీ ఆరోపించింది.

ADVERTISEMENT

వివరాలు 

రిజిస్ట్రేషన్ లేకుండా స్టాక్ సలహాలు.. ప్రచారంపై సెబీ అభ్యంతరాలు

ఏ షేర్లను ఎప్పుడు కొనాలి, ఎప్పుడు విక్రయించాలి, ఎంట్రీ, ఎగ్జిట్ ధరలు, స్టాప్‌లాస్ స్థాయులు, షేర్ల ధరలు ఏ దిశగా కదలవచ్చనే అంచనాలను రిజిస్ట్రేషన్ లేకుండానే అందించినట్లు పేర్కొంది.

గతేడాది ఆగస్టులో కర్జత్‌లోని అకాడమీ ప్రాంగణంలో సెబీ సోదాలు కూడా నిర్వహించింది.

అకాడమీ ప్రచార సామగ్రిలో లాభాలు వచ్చిన ట్రేడింగ్‌లను మాత్రమే ఎంపిక చేసి చూపించారని, శిక్షణలో పాల్గొన్నవారు భారీ లాభాలు సంపాదించవచ్చనే ప్రచారం చేశారని సెబీ తెలిపింది.

తప్పుడు అభిప్రాయాలు కలిగించే ప్రచారం, పనితీరులోని కొన్ని అంశాలను మాత్రమే వెల్లడించడంపై 2024 మార్చిలో పరిపాలనా హెచ్చరిక జారీ చేసినప్పటికీ, ఇదే తరహా కార్యకలాపాలు కొనసాగినట్లు పేర్కొంది.

వివరాలు 

విద్యాబోధన పేరుతో పెట్టుబడి సలహాలు..

అయితే, తమ కార్యక్రమాలు కేవలం విద్యాబోధన కోసమేనని, ట్రేడింగ్‌కు సంబంధించిన నిర్ణయాలను పాల్గొనేవారే తీసుకుంటారని అకాడమీ,అవధూత్ సాథే వాదించారు.

వసూలు చేసిన రుసుములు పెట్టుబడి సలహాల కోసం కాకుండా కోర్సుల కోసమేనని వివరించారు.

ఈ వాదనలను సెబీ అంగీకరించలేదు. తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని రూ.546.17కోట్లుగా నిర్ణయించింది.

అకాడమీ అనుసరించిన వ్యాపార విధానం సెబీ నియంత్రణ లక్ష్యాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.

ఈ కేసులో ఉత్తర్వులు జారీ చేసిన సెబీ అర్ధన్యాయాధికారి ఎన్.మురుగన్ మాట్లాడుతూ.. బోధన సమయంలో ఇచ్చిన సిఫార్సులు కూడా పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని అన్నారు.

వాటిని స్వీకరించే వ్యక్తిని విద్యార్థి అని పిలిచినంత మాత్రాన,ఆ సిఫార్సుల ఆధారంగా పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే నష్టాల ముప్పు తగ్గదని స్పష్టం చేశారు.

వివరాలు 

గురువుపై నమ్మకంతో పెట్టుబడులు..

బోధించే వ్యక్తి నుంచి సిఫార్సులు రావడంతో శిక్షణలో పాల్గొనేవారు వాటిపై ఎక్కువ నమ్మకం ఉంచే అవకాశం ఉందని మురుగన్ పేర్కొన్నారు.

లాభదాయకమైన ట్రేడింగ్‌లను చూపించడం, మరిన్ని కోర్సులను ప్రోత్సహించడం ద్వారా ఒక పద్ధతిపై నమ్మకాన్ని పెంచే ప్రోత్సాహకాలు ఏర్పడవచ్చని తెలిపారు.

అందువల్ల స్వతంత్రత, ప్రయోజనాల మధ్య సంఘర్షణలు లేకుండా చూడటం,ఇతర వ్యాపార కార్యకలాపాలతో సంబంధం లేకుండా వ్యవహరించడం వంటి నియంత్రణ నిబంధనలు ముఖ్యమని వివరించారు.

వివరాలు 

గౌరి సాథేపై పర్యవేక్షణ లోపాల కారణంగా చర్యలు

మార్గదర్శకుడిపై ఉన్న నమ్మకం ఈ నియంత్రణలకు ప్రత్యామ్నాయం కాదని పేర్కొన్నారు. గౌరి సాథే బాధ్యతను సెబీ ప్రత్యేకంగా పరిశీలించింది.

డైరెక్టర్‌గా తన పర్యవేక్షణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడమే ఆమెపై చర్యలకు కారణమని తెలిపింది.

అయితే, వివాదాస్పద సేవలను ఆమె స్వయంగా అందించినట్లు, ఈ విధానాన్ని రూపొందించినట్లు లేదా దాని ద్వారా అక్రమ లాభాలు పొందినట్లు ఆధారాలు లేవని సెబీ స్పష్టం చేసింది.

ADVERTISEMENT