LOADING...
HDFC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో సంచలనం.. ఛైర్మన్ రాజీనామాతో ఇన్వెస్టర్ల ఆందోళన!
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో సంచలనం.. ఛైర్మన్ రాజీనామాతో ఇన్వెస్టర్ల ఆందోళన!

HDFC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో సంచలనం.. ఛైర్మన్ రాజీనామాతో ఇన్వెస్టర్ల ఆందోళన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 19, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ప్రముఖ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్‌, స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న అటాను చక్రవర్తి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. అయితే ఇది సాధారణ రాజీనామా కాదని, బ్యాంక్ పనితీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బ్యాంకింగ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మార్చి 15న సమర్పించిన తన రాజీనామా లేఖలో చక్రవర్తి కీలక విషయాలను వెల్లడించారు. రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పరిణామాలు తన వ్యక్తిగత విలువలు, నైతిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ కారణంగానే తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Details

వెంటనే జోక్యం చేసుకున్న రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా

ఈ పరిణామంపై బ్యాంక్ యాజమాన్యం మార్చి 18న స్పందిస్తూ ఆయన రాజీనామాను ధృవీకరించి, సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం మార్చి 19న స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారిక సమాచారం అందించింది. ఈ ఆకస్మిక పరిణామంతో అప్రమత్తమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే జోక్యం చేసుకుంది. బ్యాంక్ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా కేకీ మిస్త్రీను మూడు నెలల పాటు తాత్కాలిక (పార్ట్‌టైమ్) ఛైర్మన్‌గా నియమించేందుకు ఆమోదం తెలిపింది. ఈ నియామకం మార్చి 19, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. మే 2021లో బాధ్యతలు చేపట్టిన అటాను చక్రవర్తి హయాంలోనే హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల చారిత్రాత్మక విలీనం జరిగింది. ఈ విలీనం అనంతరం బ్యాంక్ దేశంలో రెండో అతిపెద్ద రుణదాతగా అవతరించింది.

Details

నెల రోజుల్లో ఈ షేరు 8 శాతం కంటే ఎక్కువ పతనం

అయితే ఈ మెగా విలీనం ద్వారా ఆశించిన ప్రయోజనాలు ఇంకా పూర్తిగా అందలేదని చక్రవర్తి తన నిష్క్రమణ సమయంలో అభిప్రాయపడటం గమనార్హం. ఈ పరిణామాలు బ్యాంక్ షేర్లపై కూడా ప్రభావం చూపుతున్నాయి. బుధవారం ట్రేడింగ్‌లో షేరు రూ.843.05 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో ఈ షేరు 8 శాతం కంటే ఎక్కువ పతనమైంది. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలతో మార్కెట్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ, గత వారం ఈ షేరు స్వల్పంగా 2.5 శాతం లాభపడింది. అయితే తాజాగా ఛైర్మన్ రాజీనామా నేపథ్యంలో ఇన్వెస్టర్లలో మళ్లీ ఆందోళన నెలకొన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement