Stock Market: ఏఐ భయాలతో కుదేలైన మార్కెట్లు.. వెయ్యి పాయింట్లు కూలిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా కనిపిస్తున్న ప్రతికూల సంకేతాలు, అలాగే కొత్త తరహా ఫీచర్లతో ముందుకొస్తున్న ఏఐ సాధనాలపై ఏర్పడిన ఆందోళనలు దేశీయ ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. దీనితో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిని సూచీలు భారీగా క్షీణించాయి. ఫలితంగా సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా పతనమైంది. మధ్యాహ్నం 12.25 గంటల సమయంలో సెన్సెక్స్ 1,018.62 పాయింట్లు తగ్గి 82,276.04 స్థాయిలో కొనసాగుతోంది. అదే సమయంలో నిఫ్టీ 290.55 పాయింట్లు క్షీణించి 25,422.45 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏడు పైసలు తగ్గి 90.96 వద్ద నమోదైంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,ఎటర్నల్,ఇన్ఫోసిస్,టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.
వివరాలు
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
మరోవైపు హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్,ఎన్టీపీసీ,యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభపథంలో కొనసాగుతున్నాయి. సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను ఆధునికీకరించడానికి అయ్యే వ్యయాన్ని'క్లాడ్'అనే ఏఐ టూల్స్ ద్వారా గణనీయంగా తగ్గించవచ్చని ఆంథ్రోపిక్ వెల్లడించింది. ఈ ప్రకటన భారత ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో ప్రముఖ ఐటీ కంపెనీల షేర్లు మంగళవారం నష్టాల దిశగా కదిలాయి. ఇదిలా ఉండగా, డాలర్ బలపడటం మరియు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం రూపాయి మారక విలువను బలహీనపరిచాయి. ఈ పరిణామం కూడా దేశీయ సూచీలపై ప్రభావం చూపింది. సుంకాల విషయంలో అమెరికా సుప్రీం కోర్టు తీర్పును సడలింపుగా భావించి ఏ దేశమైనా దుర్వినియోగం చేస్తే భారీ టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
వివరాలు
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
ఈ వ్యాఖ్యల ప్రభావంతో సోమవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నేటి ఆసియా ట్రేడింగ్‌లో నిక్కీ, షాంఘై మార్కెట్లను మినహాయించి మిగతా మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఐబీఎం సిస్టమ్స్‌లో వినియోగించే ప్రోగ్రామింగ్ భాషను ఆంథ్రోపిక్ క్లాడ్ ఆధునికీకరించగలదన్న ప్రచారం నేపథ్యంలో ఐబీఎం షేర్లు భారీగా క్షీణించాయి. ఒక్కరోజులోనే 13 శాతానికి పైగా పడిపోయి, 26 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని స్థాయిలో నష్టాన్ని నమోదు చేశాయి. కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 40 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ప్రభుత్వ రంగాల్లో ఐబీఎం కోబాల్ ప్రోగ్రామింగ్ భాషను వినియోగిస్తోంది. దానిని ఆధునికీకరించాలంటే సంవత్సరాల సమయం పాటు వేలాది కన్సల్టెంట్ల సహాయం అవసరమవుతుందని భావిస్తున్నారు.