Stock Market: వరుసగా రెండో రోజు మార్కెట్ జోరు.. 76,000 దాటిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ యుద్ధ ప్రభావంతో వచ్చిన నష్టాల నుంచి సోమవారం పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు, మంగళవారం కూడా అదే ఊపును కొనసాగించాయి. వరుసగా రెండో రోజూ మార్కెట్లు లాభాలతోనే ముగిశాయి. ఇటీవలి పతనాల వల్ల అనేక షేర్లు ఆకర్షణీయ ధరలకు చేరడంతో మదుపర్లు కొనుగోళ్లపై ఆసక్తి చూపించారు. ఇదే సమయంలో ఆసియా మార్కెట్లు కూడా పాజిటివ్ ట్రెండ్‌లో కొనసాగాయి. అదనంగా దేశంలో చమురు, వాయువు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం మదుపర్ల నమ్మకాన్ని మరింత పెంచింది. ఈ మొత్తం పరిణామాల ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీ గణనీయ లాభాలతో ముగిశాయి. మునుపటి సెషన్‌లో 75,502 వద్ద ముగిసిన సెన్సెక్స్, మంగళవారం ఉదయం 300 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది.
వివరాలు
462 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ
రోజు మొత్తం లాభాల పరిధిలోనే కదిలింది. మధ్యాహ్నం తరువాత కొంతసేపు నష్టాల వైపు మళ్లినప్పటికీ, వెంటనే కోలుకుని మళ్లీ పుంజుకుంది. చివరికి 567 పాయింట్లు పెరిగి 76,070 వద్ద ముగిసింది. ఇదే ధోరణి నిఫ్టీలో కూడా కనిపించింది. చివరకు నిఫ్టీ 172 పాయింట్లు ఎగబాకి 23,581 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలలో నాల్కో, సెయిల్, ఎటర్నల్,ఎమ్‌సీఎక్స్ ఇండియా, టాటా స్టీల్ వంటి షేర్లు లాభాలను నమోదు చేశాయి. మరోవైపు పెర్సిస్టెంట్, టాటా ఎలాక్సీ, హిందుస్థాన్ పెట్రో, విప్రో, బంధన్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి. బ్యాంక్ నిఫ్టీ 462 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 559 పాయింట్లు ఎగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.37 వద్ద నమోదైంది.