Stock Market: మార్కెట్లపై పశ్చిమాసియా ప్రభావం.. సెన్సెక్స్ 1400 పాయింట్లు పతనం.. నిఫ్టీ 23వేల దిగువకు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చమురు ధరలు పెరుగుతాయన్న భయాలు, విదేశీ సంస్థాగత మదుపర్లు భారీగా షేర్లు విక్రయించడం వల్ల మార్కెట్లు ఒత్తిడిలోకి వెళ్లాయి. ఈ ప్రభావంతో ఈ వారాన్ని కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతోనే ప్రారంభించాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ దాదాపు 1400 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కీలకమైన 23,000 స్థాయిని కోల్పోయింది. ఉదయం 9:20 గంటల సమయానికి సెన్సెక్స్ 1243.27 పాయింట్లు పడిపోయి 73,289.59 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో నిఫ్టీ 377.8 పాయింట్లు నష్టపోయి 22,736.70 వద్ద కొనసాగింది.
వివరాలు
ప్రారంభ ట్రేడింగ్‌లోనే భారీ నష్టాలు
ఒక దశలో సెన్సెక్స్ నష్టాలు 1400 పాయింట్ల వరకు పెరగడం గమనార్హం. నిఫ్టీ సూచీలో హిందాల్కో, టాటా స్టీల్, ఎస్‌బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు మ్యాక్స్ హెల్త్‌కేర్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కనిపిస్తున్నాయి. ఆటో, మీడియా, బ్యాంకింగ్, లోహ రంగాలకు చెందిన సూచీలు సుమారు 2 శాతం వరకు పడిపోయాయి. రూపాయి విలువకు భారీ దెబ్బ ఇక రూపాయి విలువ కూడా క్షీణత దిశలోనే కొనసాగుతోంది. నేటి ట్రేడింగ్‌లో రూపాయి 33 పైసలు పడిపోయి డాలర్‌తో పోలిస్తే 93.86 వద్ద కొత్త జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది.