LOADING...
Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ @ 25,482
స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ @ 25,482

Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ @ 25,482

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉదయం ప్రారంభంలోనే గణనీయమైన లాభాలతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ సూచీలు మధ్యాహ్నానికి దిశ మార్చుకున్నాయి. గరిష్ఠ స్థాయిల వద్ద పెట్టుబడిదారులు లాభాల బుకింగ్‌కు దిగడం, అలాగే మంగళవారం విదేశీ పెట్టుబడిదారులు రూ.102 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్‌పై ఒత్తిడిని తెచ్చింది. అదనంగా, గత కొన్ని రోజులుగా నిఫ్టీ 25,670 స్థాయిని అధిగమించలేకపోవడం కూడా పెట్టుబడిదారులను జాగ్రత్తగా వ్యవహరించేలా చేసింది. ఫలితంగా మధ్యాహ్నం వరకూ భారీ లాభాలు నమోదు చేసిన సూచీలు చివరికి స్వల్ప పెరుగుదలతోనే ముగిశాయి. మొత్తంగా సెన్సెక్స్, నిఫ్టీ పరిమిత లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).

వివరాలు 

50 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

గత ట్రేడింగ్ సెషన్ ముగింపు స్థాయి 82,225తో పోలిస్తే బుధవారం ఉదయం సెన్సెక్స్ దాదాపు 220 పాయింట్ల పెరుగుదలతో ప్రారంభమైంది. ఆ తర్వాత కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీ మరింత ఎగిసింది. ఒక దశలో 700 పాయింట్లకు పైగా లాభపడి 82,957 వద్ద రోజువారీ గరిష్ఠాన్ని తాకింది. అయితే మధ్యాహ్నం విక్రయాలు పెరగడంతో సూచీ క్రమంగా క్షీణించింది. ఇంట్రాడే గరిష్ఠ స్థాయి నుంచి సుమారు 800 పాయింట్లు వెనక్కి తగ్గింది. చివరకు 50 పాయింట్ల లాభంతో 82,276 వద్ద నిలిచింది. ఇదే సమయంలో నిఫ్టీ కూడా సెన్సెక్స్ ధోరణినే అనుసరించింది. చివరికి 57 పాయింట్లు పెరిగి 25,482 వద్ద ముగిసింది (stock market news today).

వివరాలు 

3 పాయింట్లు తగ్గిన బ్యాంక్ నిఫ్టీ

సెన్సెక్స్, నిఫ్టీ సూచీలలో మ్యాన్‌కైండ్ ఫార్మా, నాల్కో, వేదాంత, లారస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్ షేర్లు లాభపడ్డాయి (share market news). మరోవైపు ఐఆర్‌ఎఫ్‌సీ, మణప్పురం ఫైనాన్స్, అదానీ ఎనర్జీ, హిందుస్థాన్ పెట్రో, సుజ్లాన్ ఎనర్జీ షేర్లు నష్టాలను చవిచూశాయి. బ్యాంక్ నిఫ్టీ 3 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 339 పాయింట్లు పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.95 వద్ద నమోదైంది.

Advertisement