Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సూచీలు.. 790 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
మునుపటి ట్రేడింగ్ సెషన్‌లో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం బలంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం,ఐటీ,ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడం మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి. దీంతో కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 790.54 పాయింట్లు లేదా 1.04 శాతం పెరిగి 76,991.22 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 197.55 పాయింట్లు లేదా 0.83 శాతం లాభపడి 24,021.65 వద్ద స్థిరపడింది. అంతకుముందు మంగళవారం సెన్సెక్స్ 893.39 పాయింట్లు లేదా 1.16 శాతం నష్టపోయి 76,200.68 వద్ద ముగియగా, నిఫ్టీ 278.80 పాయింట్లు లేదా 1.16 శాతం క్షీణించి 23,824.10 వద్ద ముగిసింది.
వివరాలు
మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలు ఇవే..
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు మినహా మిగతా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. చమురు ధరల తగ్గుదల ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.02 శాతం తగ్గి 76.29 డాలర్లకు చేరుకుంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన చమురు ట్యాంకర్లు మళ్లీ కదలడం ప్రారంభించనున్నాయనే సంకేతాలు రావడంతో చమురు ధరలు నాలుగు నెలల కనిష్ఠ స్థాయిలకు చేరువయ్యాయి. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ, బ్రెంట్ క్రూడ్ ధర 77 డాలర్ల దిగువకు రావడంతో భారత ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఒత్తిడి తగ్గిందన్నారు.
వివరాలు
ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు
రూపాయి స్థిరంగా ఉండటం, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు తగ్గడం మార్కెట్‌కు సానుకూల సంకేతాలని పేర్కొన్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) మంగళవారం రూ.17.86 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతు లభించింది. ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆశలు భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరే దిశగా చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అమెరికా ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనాలు కలుగుతాయనే అంచనాలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని పెంచాయి.
వివరాలు
ఆసియా మార్కెట్ల మద్దతు
దక్షిణ కొరియా కోస్పి, హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్ సూచీలు లాభాల్లో ట్రేడవడంతో దేశీయ మార్కెట్లకు సానుకూల సంకేతాలు అందాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్లు ఐటీ రంగ షేర్లలో బలమైన కొనుగోళ్లు నమోదయ్యాయి. నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 1 శాతం పెరిగింది. టెక్ మహీంద్రా 2.6 శాతం ఎగబాకగా, ఇన్ఫోసిస్ 1.3 శాతం, టీసీఎస్ 0.6 శాతం చొప్పున లాభపడ్డాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్ల జోష్ ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి దిగ్గజ ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో బ్యాంక్ నిఫ్టీ 1.5 శాతానికి పైగా ఎగిసింది. దీంతో ప్రధాన సూచీలకు బలమైన మద్దతు లభించింది.
వివరాలు
తగ్గిన ఇండియా విక్స్
మార్కెట్ భయ సూచికగా భావించే ఇండియా విక్స్ 2.65 శాతం తగ్గి 13.57 స్థాయికి చేరుకుంది. ఇది మార్కెట్లో అనిశ్చితి కొంత మేర తగ్గినట్లు సూచిస్తోంది. సాంకేతిక విశ్లేషణ ఏమంటోంది? యాక్సిస్ డైరెక్ట్ రీసెర్చ్ హెడ్ రాజేశ్ పాల్వియా ప్రకారం, నిఫ్టీ 23,950 స్థాయి పైన నిలదొక్కుకుంటే 24,100 నుంచి 24,150 స్థాయిల వరకు ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం 23,780 వద్ద కీలక మద్దతు ఉంది. ఈ స్థాయి దిగువకు వెళ్తే లాభాల స్వీకరణ పెరిగి నిఫ్టీ 23,600 ప్రాంతానికి చేరే అవకాశం ఉందన్నారు. స్వల్పకాలంలో గ్లోబల్ టెక్నాలజీ షేర్ల కదలికలు మార్కెట్ దిశను నిర్ణయించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.