Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. రూ.4 లక్షల కోట్లకు పైగా పెరిగిన మదుపర్ల సంపద..
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. కంపెనీల త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) తొలగింపునకు సెబీ ప్రతిపాదనలు చేయడం వంటి పరిణామాలు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. దీంతో మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పెరగ్గా.. నిఫ్టీ 23,600 మార్కును దాటింది.
వివరాలు
నిఫ్టీ @ 23,660
ఉదయం 10.50 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 806 పాయింట్లు లాభపడి 76,500 వద్ద ట్రేడవుతోంది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 219 పాయింట్లు పెరిగి 23,660 వద్ద కొనసాగుతోంది.
ఈ ర్యాలీతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.4 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.486 లక్షల కోట్లకు చేరింది.
ఫార్మా రంగం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా రంగాల సూచీలు ఒక శాతానికి పైగా పెరిగాయి.
వివరాలు
మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలివే..
ఎల్‌టీసీజీపై సెబీ ప్రతిపాదనలు: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, దేశీయ మ్యూచువల్ ఫండ్లకు ఊరట కల్పించేందుకు ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును రద్దు చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం విదేశీ మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది.
ముడి చమురు ధరలు తగ్గుముఖం: అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గత రోజుతో పోలిస్తే ధర స్వల్పంగా పెరిగినప్పటికీ.. ఇటీవల నమోదైన గరిష్ఠ ధరలతో పోలిస్తే తక్కువగా ఉండటం మార్కెట్లకు ఊరటనిస్తోంది.
వివరాలు
మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలివే..
విదేశీ పెట్టుబడుల కొనుగోళ్లు: భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే మన మార్కెట్లలో రూ.3,115 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ కొనుగోళ్లు మార్కెట్ ర్యాలీకి మద్దతుగా నిలుస్తున్నాయి.
రూపాయి విలువ బలోపేతం: డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడుతోంది. మంగళవారం ట్రేడింగ్‌లో రూపాయి 12 పైసలు లాభపడి 94.72 వద్ద కొనసాగుతోంది. కరెన్సీ విలువ పెరగడం కూడా మార్కెట్ సానుకూలతకు తోడ్పడుతోంది.