LOADING...
Water Prices: సామాన్యులకు షాక్.. దేశంలో పెరిగిన వాటర్ బాటిళ్ల ధరలు
సామాన్యులకు షాక్.. దేశంలో పెరిగిన వాటర్ బాటిళ్ల ధరలు

Water Prices: సామాన్యులకు షాక్.. దేశంలో పెరిగిన వాటర్ బాటిళ్ల ధరలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2026
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం దేశంలో నిత్యావసరాల ధరలపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే గ్యాస్, ఇంధన, వంటనూనె ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు మరో షాక్ ఎదురైంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో, దాని ప్రభావం వివిధ ఉత్పత్తులపై కనిపిస్తోంది. తాజాగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల ధరలు కూడా పెరిగాయి. ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో ఉపయోగించే ముడి సరుకు ఖర్చులు అధికమవడంతో దేశవ్యాప్తంగా కంపెనీలు ధరలను 8 శాతం నుంచి 11 శాతం వరకు పెంచాయి. బిస్లరీతో పాటు ఇతర కంపెనీలు కూడా ఈ నిర్ణయం తీసుకున్నాయి.

Details

ప్యాకేజింగ్ ఖర్చుల పెరుగుదల

ప్రస్తుతం 12 బాటిళ్లు ఉండే బిస్లరీ 1 లీటర్ ప్యాక్ ధర రూ.216 నుంచి రూ.240కి పెరిగింది. ప్యాకేజింగ్ మెటీరియల్ ఖర్చులు పెరగడం వల్ల ధరలను పెంచక తప్పలేదని కంపెనీలు పేర్కొన్నాయి. ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో ఉపయోగించే పాలిమర్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ పాలిమర్‌ను క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేస్తారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పాలిమర్ ధరలు కూడా పెరిగి, వాటర్ బాటిల్ కంపెనీలపై అదనపు భారం పడింది. అదే సమయంలో బాటిళ్ల మూతలు, కార్టన్ పెట్టెలు, లేబుళ్లు, టేప్ వంటి ఇతర ప్యాకేజింగ్ పదార్థాల ధరలు కూడా పెరిగాయి. ప్లాస్టిక్ పదార్థాల ధరలు దాదాపు 50 శాతం పెరిగి కిలోగ్రాముకు రూ.170కి చేరాయి.

Details

జీఎస్టీ తగ్గింపుతో ప్రయోజనం తక్కువే

మూతల ధరలు రెండింతలు కావడంతో ఉత్పత్తి ఖర్చు మరింత పెరిగింది. గత సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం వాటర్ బాటిళ్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీంతో కొంతకాలం ధరలు తగ్గినా, ప్రస్తుతం ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా మళ్లీ పెరిగాయి. పార్లే ఆగ్రో, క్లియర్ వంటి ప్రీమియం బ్రాండ్ల వాటర్ బాటిళ్ల ధరలు కూడా 8 నుంచి 11 శాతం వరకు పెరిగాయి.

Advertisement

Details

నీటి కొరతతో డిమాండ్ పెరుగుదల

దేశంలో తాగునీటి సమస్య మరింత తీవ్రమవుతోంది. భూగర్భ జలాల్లో సుమారు 70 శాతం కలుషితమైందని అంచనా. 140 కోట్ల జనాభాకు తాగునీరు అందించడం సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో చాలా మంది వాటర్ బాటిళ్లపై ఆధారపడుతున్నారు. ముడి పదార్థాల ధరలు పెరగడంతో వాటర్ బాటిల్ పరిశ్రమ మొత్తం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో వినియోగం ఎక్కువగా ఉండటంతో ఈ ధరల పెరుగుదల సామాన్యులకు పెద్ద భారంగా మారే అవకాశముంది.

Advertisement