LOADING...
UPI: గ్రామీణ మహిళల్లో యూపీఐ వినియోగం భారీగా పెరుగుతోంది.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు
తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు

UPI: గ్రామీణ మహిళల్లో యూపీఐ వినియోగం భారీగా పెరుగుతోంది.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్రామాలు,చిన్న పట్టణాల్లో మహిళలు డిజిటల్‌ చెల్లింపుల వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. వారానికి కనీసం ఒకసారి అయినా యూపీఐ సేవలను ఉపయోగిస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా కిరాణా సరుకులు కొనుగోలు చేయడం, విద్యుత్‌ లేదా ఇతర వినియోగ బిల్లులు చెల్లించడం వంటి రోజువారీ అవసరాల కోసం యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌)ను ఎక్కువగా వినియోగిస్తున్నారని తెలిపింది. ప్రజలు క్రమంగా డిజిటల్‌ చెల్లింపుల వైపు మారుతున్నారని పేనియర్‌బై విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. పేనియర్‌బై ఉమెన్‌ ఫైనాన్షియల్‌ ఇండెక్స్‌ 2026 ప్రకారం మహిళల్లో పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించిన ఆర్థిక ఉత్పత్తులపై అవగాహన కూడా క్రమంగా పెరుగుతోంది.

వివరాలు 

కుటుంబాల్లో 85% మంది ప్రధాన పొదుపుదారులు 

గ్రామీణ ప్రాంతాలు,సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో సుమారు 38 శాతం మహిళలు రోజువారీ నిత్యావసరాల కొనుగోళ్ల కోసం వారానికి కనీసం ఒక్కసారైనా యూపీఐను వినియోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. అదే సమయంలో మహిళల్లో ఆర్థిక క్రమశిక్షణను చూపించే విధంగా పొదుపు అలవాటు కూడా పెరుగుతోందని వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో 85 శాతం మంది తమ కుటుంబాల్లో తామే ప్రధాన పొదుపుదారులమని తెలిపారు. దేశంలోని గ్రామీణ, చిన్న పట్టణాల్లో డిజిటల్‌ మరియు ఆర్థిక సేవలను అందిస్తున్న 10,000 మంది మహిళా ఏజెంట్లను ఆధారంగా చేసుకుని ఈ సర్వే నిర్వహించారు. ఆ వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది.

వివరాలు 

44 శాతం మహిళలు పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి

నివేదిక ప్రకారం సుమారు 44 శాతం మహిళలు తమ ప్రాంతాల్లో ఉన్న సేవా కేంద్రాల సహాయంతో చిన్న మొత్తాల్లో సిప్‌ల ద్వారా బంగారం ఆధారిత పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు వంటి అవసరమైనప్పుడు సులభంగా నగదు ఉపసంహరించుకునే వీలున్న చిన్న మొత్తాల డిపాజిట్‌ పథకాలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ తరహా పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి 98 శాతం మహిళలు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

Advertisement

వివరాలు 

పది శాతం కంటే తక్కువ మంది మహిళలకు మ్యూచువల్‌ ఫండ్స్‌పై పరిమితంగానే అవగాహన 

అయితే మ్యూచువల్‌ ఫండ్స్‌పై మహిళల్లో అవగాహన ఇంకా పరిమితంగానే ఉంది. పది శాతం కంటే తక్కువ మంది మహిళలకే ఈ పెట్టుబడి అవకాశాలపై అవగాహన ఉన్నట్లు నివేదిక తెలిపింది. మరోవైపు నగదు ఉపసంహరణ సేవలు మాత్రం మహిళలకు ఇప్పటికీ అత్యంత ముఖ్యమైనవిగా కొనసాగుతున్నాయి. కుటుంబ ఖర్చులను నిర్వహించుకోవడానికి, అవసరమైనప్పుడు వెంటనే నగదు అందుబాటులో ఉంచుకోవడానికి ఈ సేవలు వారికి సహాయపడుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.

Advertisement