LOADING...
Silver: అమెరికా నిరుద్యోగ గణాంకాల ప్రభావం.. రికార్డు స్థాయికి వెండి ధర
అమెరికా నిరుద్యోగ గణాంకాల ప్రభావం.. రికార్డు స్థాయికి వెండి ధర

Silver: అమెరికా నిరుద్యోగ గణాంకాల ప్రభావం.. రికార్డు స్థాయికి వెండి ధర

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా నుంచి వచ్చిన నిరాశాజనక నిరుద్యోగ గణాంకాల నేపథ్యంలో వెండి ధరలు చరిత్రాత్మక గరిష్ఠానికి చేరాయి. తొలిసారిగా వెండి ఔన్స్ ధర 65 డాలర్ల మార్క్‌ను దాటింది. అమెరికా ఉద్యోగ మార్కెట్ బలహీనపడుతున్నట్లు సంకేతాలు రావడంతో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం పెరిగిందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీనికి తోడు డాలర్ బలహీనపడటం కూడా వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. ఇదే ప్రభావంతో బంగారం ధరలు కూడా ఎగబాకాయి. స్పాట్ సిల్వర్ ధర 2.8 శాతం పెరిగి ఔన్స్‌కు 65.63 డాలర్ల రికార్డు స్థాయిని తాకగా, బంగారం ధర 0.4 శాతం పెరిగి ఔన్స్‌కు 4,321.56 డాలర్లకు చేరింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు కూడా స్పాట్ ధరలతో సమానంగా పెరిగాయి.

వివరాలు 

అమెరికా నిరుద్యోగ రేటు 4.6 శాతం 

మార్కెట్లో ఊహాజనిత పెట్టుబడులు పెరగడమే వెండి ధరలు ఈ స్థాయికి చేరడానికి కారణమని గోల్డ్‌సిల్వర్ సెంట్రల్ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియన్ లాన్ తెలిపారు. నవంబర్ నెలలో అమెరికా నిరుద్యోగ రేటు 4.6 శాతానికి పెరగడం కూడా విలువైన లోహాల ధరలకు బలాన్నిచ్చింది. రాయిటర్స్ సర్వే అంచనా వేసిన 4.4 శాతం కంటే ఇది ఎక్కువగా ఉండటంతో మార్కెట్లలో స్పందన కనిపించింది. ఈ గణాంకాలు డాలర్‌ను మరింత బలహీనపరిచాయని, దాంతో పెట్టుబడిదారులు రిస్క్ నుంచి రక్షణ కోసం ఇతర ఆస్తుల వైపు మొగ్గుచూపుతున్నారని లాన్ వివరించారు. డాలర్ ఇండెక్స్ రెండు నెలల కనిష్ఠ స్థాయిల వద్దే కొనసాగుతుండటంతో విదేశీ కొనుగోలుదారులకు బులియన్ మరింత ఆకర్షణీయంగా మారింది.

వివరాలు 

2026లో మరో రెండు సార్లు 25 బేసిస్ పాయింట్ల రేటు కోతలు

ఇదిలా ఉండగా, గత వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదికి చివరిదిగా భావిస్తున్న క్వార్టర్ పాయింట్ వడ్డీ రేటు తగ్గింపును ప్రకటించింది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు అంచనాలకన్నా కాస్త సాఫ్ట్‌గా ఉన్నట్లు ట్రేడర్లు భావిస్తున్నారు. 2026లో మరో రెండు సార్లు 25 బేసిస్ పాయింట్ల రేటు కోతలు ఉండొచ్చన్న అంచనాలు కొనసాగుతున్నాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న సమయంలో బంగారం, వెండి లాంటి వడ్డీ లేని ఆస్తులకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ లోహాల ధరలు మరింత బలపడుతున్నాయి.

Advertisement