House Buy: కోటిన్నరతో ఇంటి కల నెరవేర్చుకోండిలా… ఈ ప్లాన్‌తో ఈఎంఐ లేకుండా సాధ్యం
ఈ వార్తాకథనం ఏంటి
2026లో ఇల్లు కొనాలని భావిస్తున్న వారికి ఆర్థిక నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజల పెద్ద లక్ష్యం సొంత ఇల్లు కలిగి ఉండటం. అయితే సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడంతో చాలామంది ఈఎంఐల ఒత్తిడిలో పడుతున్నారు. ఇల్లు నిజంగా ఆస్తా లేదా బాధ్యతా అనే విషయం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనకు ఆదాయం తీసుకువచ్చేది ఆస్తి. ఉదాహరణకు అద్దె వచ్చే ప్రాపర్టీలు లేదా ఇతర పెట్టుబడులు. కానీ మన దగ్గర నుంచి డబ్బు ఖర్చు అయ్యే వాటిని బాధ్యతలు అంటారు. లోన్ తీసుకుని ఇల్లు కొంటే, అప్పు పూర్తిగా చెల్లించే వరకు ఆ ఇల్లు బ్యాంక్ ఆధీనంలోనే ఉంటుంది. ఆ సమయంలో అది మనపై ఆర్థిక భారంగా ఉంటుంది.
వివరాలు
మధ్యతరగతి వారు చేసే తప్పు ఇదే..
నెలకు రూ.50,000 నుంచి రూ.2 లక్షల వరకు సంపాదించే మధ్యతరగతి వారు చేసే ప్రధాన తప్పుల్లో ఒకటి ఉద్యోగం వచ్చిన వెంటనే లేదా తక్కువ వయసులోనే ఇల్లు కొనడం. హైదరాబాద్ వంటి నగరాల్లో కోటి రూపాయల ఫ్లాట్ కొనాలంటే రూ.10 నుంచి 15 లక్షల వరకు డౌన్ పేమెంట్ చేసి, మిగతా మొత్తాన్ని లోన్‌గా తీసుకోవాలి. దీంతో నెలకు రూ.70,000 నుంచి రూ.80,000 వరకు ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. ఇది 20 నుంచి 30 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అంటే చాలా కాలం బ్యాంక్‌కు పని చేస్తున్నట్టే అవుతుంది.
వివరాలు
ఇతర లోన్లపై ఆధారపడకూడదు
ఇల్లు కొనడం మాత్రమే ఖర్చు కాదు. ఆ తర్వాత ఆస్తి పన్ను, ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్, వాహనం కొనుగోలు, సెలవులు, పిల్లల చదువు వంటి ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇవన్నీ కలిసి ఆర్థిక ఒత్తిడిని పెంచి, క్రెడిట్ కార్డులు లేదా ఇతర లోన్లపై ఆధారపడే పరిస్థితికి తీసుకెళ్తాయి. అందుకే యువత వెంటనే ఇల్లు కొనకుండా, 10 సంవత్సరాలు వేచి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో ప్రతి నెల ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని, ఉదాహరణకు రూ.50,000, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడిగా పెట్టాలి. ఇలా 10 సంవత్సరాల పాటు రూ.60 లక్షలు పెట్టుబడి పెడితే, సగటున 12% రాబడితో అది దాదాపు రూ.1.20 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది.
వివరాలు
ఇలా చేస్తే సొంతిళ్లు సాధ్యం..
ఈ మొత్తాన్ని ఉపయోగించి ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత, సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) ద్వారా ఈఎంఐలను చెల్లించవచ్చు. అంటే మన పెట్టుబడుల నుంచే ఈఎంఐలు చెల్లించబడతాయి. ఈ విధానం వల్ల ఆర్థిక భారం తగ్గుతుంది. ఉద్యోగం లేకపోయినా ఈ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయం జీవన ఖర్చులకు ఉపయోగపడుతుంది. మధ్యతరగతి వారు కష్టపడి సంపాదించిన డబ్బును నేరుగా ఈఎంఐలు లేదా పన్నుల రూపంలో చెల్లించడం వల్ల తమ ఆర్థిక స్వేచ్ఛను కోల్పోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ముందుగా ఆస్తులను నిర్మించుకోవడం, ఆ తర్వాత ఇల్లు కొనడం ఉత్తమ నిర్ణయం. ఈ విధమైన ఆర్థిక నియమాలను పాటిస్తే మధ్యతరగతి ప్రజలు అప్పుల భారంలో చిక్కుకోకుండా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చు.