LOADING...
Form-16: ఫారం-16 అందిందా? ఐటీఆర్ దాఖలుకు ముందు ఇవి తప్పనిసరి
ఫారం-16 అందిందా? ఐటీఆర్ దాఖలుకు ముందు ఇవి తప్పనిసరి

Form-16: ఫారం-16 అందిందా? ఐటీఆర్ దాఖలుకు ముందు ఇవి తప్పనిసరి

వ్రాసిన వారు Moogati Shabari
Jun 12, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగులకు యాజమాన్య సంస్థలు ఫారం-16లను అందించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఫారం-16 చేతికి వచ్చిన వెంటనే ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి తొందరపడకూడదు. అందులోని వివరాలను ఇతర పన్ను పత్రాలతో జాగ్రత్తగా సరిపోల్చి చూడాలి. ఏవైనా పొరపాట్లు కనిపిస్తే, రిటర్నులు సమర్పించే ముందు వాటిని సరిచేయించుకోవడం అత్యంత ముఖ్యం. ఐటీఆర్ ఫైలింగ్‌కు ముందుగా ప్రతి పన్ను చెల్లింపుదారు తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశాలు ఇవి.

వివరాలు

ఫారం-16 అంటే ఏమిటి?..అందులో ఏముంది?

ఫారం-16 అనేది ఉద్యోగికి యాజమాన్యం జారీ చేసే టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) ధ్రువీకరణ పత్రం. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగికి చెల్లించిన జీతం, ఆ జీతంపై మినహాయించిన పన్ను, ప్రభుత్వానికి చెల్లించిన పన్ను వివరాలు ఇందులో పొందుపరుస్తారు.

వివరాలు

పార్ట్-ఏలో ఏముంటుంది?

ఫారం-16లోని పార్ట్-ఏలో ఉద్యోగి, యాజమాన్యానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఉంటుంది. ఇందులో ఉద్యోగి పేరు, యాజమాన్యం వివరాలు, చెల్లించిన వేతనం, టీడీఎస్ కోతలు, ప్రభుత్వానికి జమ చేసిన పన్ను వివరాలు నమోదు చేస్తారు. అలాగే మదింపు సంవత్సరం, ఉద్యోగ కాలం, త్రైమాసిక ప్రాతిపదికన జీత వివరాలు, చలాన్ లేదా బుక్ ఐడెంటిఫికేషన్ నంబర్ వంటి సమాచారం కూడా ఉంటుంది. పార్ట్-బీలో ఏముంటుంది? పార్ట్-బీలో పన్ను విధించదగిన ఆదాయానికి సంబంధించిన గణన ఉంటుంది. ఉద్యోగి పొందిన జీతం, వర్తించే మినహాయింపులు, తగ్గింపులు, చివరకు చెల్లించాల్సిన నికర పన్ను వివరాలు ఇందులో ఉంటాయి.

Advertisement

వివరాలు

ఫారం-16ఏ అంటే ఏమిటి?

జీత ఆదాయం కాకుండా ఇతర ఆదాయాలపై మినహాయించిన టీడీఎస్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని ఫారం-16ఏ అంటారు. బ్యాంక్ వడ్డీలు, వృత్తిపరమైన ఫీజులు, అద్దె ఆదాయం, కమీషన్లు వంటి వాటిపై టీడీఎస్ కట్ చేసినప్పుడు దీనిని జారీ చేస్తారు. పన్నును ప్రభుత్వానికి జమ చేసి, టీడీఎస్ రిటర్నులు సమర్పించిన అనంతరం ప్రతి త్రైమాసికానికి ఇది అందజేస్తారు. అయితే ఫారం-16, ఫారం-16ఏలు ఎంత పన్ను కోత జరిగిందో తెలియజేస్తాయి గానీ, పన్ను పరిధిలోకి వచ్చే మొత్తం ఆదాయానికి సంబంధించిన పూర్తి సమాచారం అందించకపోవచ్చు.

Advertisement

వివరాలు

వ్యక్తిగత వివరాలు తప్పనిసరిగా తనిఖీ చేయాలి..

ఫారం-16, ఫారం-16ఏల్లో మీ పేరు, పాన్ నంబర్, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలు సరిగ్గా ఉన్నాయో ముందుగా నిర్ధారించుకోవాలి. చిన్న పొరపాటు కూడా రిటర్నుల ప్రాసెసింగ్ సమయంలో సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అలాగే యాజమాన్యం పేరు, పాన్, టాన్, మదింపు సంవత్సరం వంటి వివరాలు సరైనవేనా అనేది పరిశీలించాలి. పార్ట్-ఏ, పార్ట్-బీలోని జీతం, టీడీఎస్ వివరాలను వేతన స్లిప్పులతో సరిపోల్చి చూడాలి. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నవారు హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీఏ, ప్రావిడెంట్ ఫండ్, జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియం తదితర తగ్గింపులు సరిగ్గా ప్రతిబింబించాయో లేదో తనిఖీ చేయాలి. ఒకవేళ కొన్ని తగ్గింపులు ఫారంలో లేకపోతే, ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో వాటిని క్లెయిం చేసుకోవచ్చు.

వివరాలు

ఏఐఎస్, ఫారం-26ఏఎస్‌తో పోల్చి చూడాలి..

ఫారం-26ఏఎస్ అనేది పాన్ నంబరుపై నమోదైన పన్ను కోతలు, పన్ను చెల్లింపులు, పన్ను క్రెడిట్ల వివరాలను చూపించే వార్షిక పన్ను స్టేట్‌మెంట్. మరోవైపు వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) మరింత విస్తృత సమాచారం అందిస్తుంది. ఫారం-16లో కనిపించని బ్యాంకు వడ్డీ ఆదాయం, డివిడెండ్లు వంటి అదనపు ఆదాయాలు ఏఐఎస్‌లో నమోదు కావచ్చు. ఆదాయపు పన్ను శాఖ మీరు రిటర్నులో చూపిన ఆదాయాన్ని ఏఐఎస్, ఫారం-26ఏఎస్‌లలోని సమాచారంతో పోల్చి పరిశీలిస్తుంది. అందువల్ల ఫారం-16లోని ఆదాయం, ఏఐఎస్ మరియు 26ఏఎస్‌లలోని వివరాలతో సరిపోతున్నాయో లేదో ముందుగానే ధృవీకరించాలి. వడ్డీ ఆదాయం, మూలధన లాభాలు వంటి అంశాలు ఏఐఎస్‌లో ఉండి ఫారం-16లో లేకపోతే, వాటికి సంబంధించిన పన్ను బాధ్యతను లెక్కించి రిటర్నులో చేర్చాలి.

వివరాలు

ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు ఉంటే..

ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంస్థల్లో పనిచేసినవారు, ఆయా సంస్థలన్నింటి నుంచి ఫారం-16లను సేకరించాలి. అన్ని ఫారాల్లోని ఆదాయం, మినహాయింపులను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని రిటర్నులో చూపించాలి. ప్రామాణిక తగ్గింపును (స్టాండర్డ్ డిడక్షన్) ఒకసారి మాత్రమే క్లెయిం చేయాలి. ఉద్యోగం మారిన సమయంలో పాత సంస్థలోని జీత వివరాలను కొత్త సంస్థకు అందించడం ఉత్తమం. అలా చేయకపోతే టీడీఎస్ సరైన విధంగా మినహాయించబడకపోవచ్చు. ఫలితంగా తర్వాత అదనపు పన్నుతో పాటు వడ్డీ, జరిమానాలు కూడా చెల్లించాల్సి రావచ్చు.

వివరాలు

తప్పులు గుర్తిస్తే ఏమి చేయాలి?

ఫారం-16లో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లు గుర్తించిన వెంటనే యాజమాన్యాన్ని సంప్రదించి సవరించిన ఫారం-16ను ఇవ్వాలని కోరాలి. ఐటీఆర్ దాఖలు చేసే ముందు వీలైనంత వరకు అన్ని తప్పులను సరిచేయించుకోవడం మంచిది. గడువులోపు సవరించిన ఫారం అందకపోతే, మీ వద్ద ఉన్న ఆధారాలు, ఫారం-26ఏఎస్, ఏఐఎస్‌లలోని సమాచారాన్ని ఆధారంగా తీసుకుని సరైన వివరాలతో రిటర్నులు సమర్పించాలి. అదనపు పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే, రిటర్ను దాఖలు చేసే ముందు ఆ మొత్తాన్ని చెల్లించడం అవసరం.

Advertisement