LOADING...
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. ₹14 లక్షల కోట్లు ఆవిరి 
భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. ₹14 లక్షల కోట్లు ఆవిరి

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. ₹14 లక్షల కోట్లు ఆవిరి 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 23, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి భారీ పతనాన్ని చవిచూశాయి. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ సంస్థాగత మదుపర్ల (FIIలు) నిరంతర అమ్మకాలు మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా సూచీలు గణనీయంగా క్షీణించాయి. ఒక్కరోజులోనే మదుపర్ల సంపద సుమారు రూ.14 లక్షల కోట్లు కరిగిపోగా, మొత్తం మార్కెట్ క్యాప్ రూ.415 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 93.98 వద్ద కొత్త కనిష్ఠాన్ని నమోదు చేసింది.

వివరాలు 

భారీగా క్షీణించిన సెన్సెక్స్‌, నిఫ్టీ

సెన్సెక్స్‌ ఉదయం 73,732.58 వద్ద (మునుపటి ముగింపు 74,532.96) భారీ నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఇంట్రాడేలో 72,558.44 వరకు పడిపోయిన సూచీ, చివరికి 1836.57 పాయింట్లు కోల్పోయి 72,696.39 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 601.85 పాయింట్లు పడిపోయి 22,512.65 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, టెక్ మహీంద్రా మినహా మిగతా అన్ని షేర్లు నష్టపోయాయి. టైటాన్‌, ట్రెంట్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, బీఈఎల్‌, ఇండిగో వంటి కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోయాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 113.20 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర 4272 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు..

పెరుగుతున్న యుద్ధ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని హెచ్చరించారు. లేకపోతే ఇరాన్ పవర్‌ప్లాంట్లపై దాడులు చేస్తామని ప్రకటించారు. దీనికి ప్రతిగా, హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామాలు యుద్ధం మరింత తీవ్రమవుతుందన్న భయాలను పెంచి మార్కెట్లను కుదిపేశాయి. 110 డాలర్లపైనే చమురు ధరలు: యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు 110 డాలర్లకు పైగా కొనసాగుతున్నాయి. దీని వల్ల ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

వివరాలు 

రూపాయి రికార్డు పతనం

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ నిరంతరం పడిపోతూ కొత్త కనిష్ఠాలను తాకుతోంది. చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు రూపాయి బలహీనతకు ప్రధాన కారణాలుగా మారాయి. ఇది కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఎఫ్‌ఐఐల భారీ అమ్మకాలు ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు భారీగా షేర్లను విక్రయిస్తున్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 20 వరకు 16 ట్రేడింగ్ సెషన్లలో దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన షేర్లు అమ్మేశారు. అంటే ప్రతి ట్రేడింగ్ గంటకు సుమారు రూ.1000 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు అంచనా. శుక్రవారం ఒక్కరోజే రూ.5518 కోట్ల ఈక్విటీ షేర్లను ఎఫ్‌ఐఐలు విక్రయించడం గమనార్హం.

Advertisement

వివరాలు 

ఇతర ప్రతికూల సంకేతాలు

అమెరికాలో 10 ఏళ్ల బాండ్ యీల్డ్‌లు పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో బలహీనత కూడా మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. అంతేకాదు, ఇండస్ట్రియల్ డీజిల్ ధరను లీటరుకు రూ.22 పెంచడం ఇన్‌ఫ్రా, కన్‌స్ట్రక్షన్, తయారీ రంగాలపై ఒత్తిడిని పెంచుతుందన్న ఆందోళనలు ఉన్నాయి.

Advertisement