Stock Market: దేశీయ మార్కెట్లకు షాక్.. ఒక్కరోజులో రూ.9 లక్షల కోట్లు ఆవిరి
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల లాభాల ర్యాలీ తర్వాత తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై ఇంకా స్పష్టత లేకపోవడం, అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమనడం వల్ల శుక్రవారం మార్కెట్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ భారీగా పడిపోగా, నిఫ్టీ మళ్లీ 23 వేల దిగువకు చేరింది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.422 లక్షల కోట్లకు పడిపోవడంతో, ఒక్కరోజులోనే మదుపర్ల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్లు ఆవిరైంది.
వివరాలు
ఆరంభం నుంచే నష్టాల పర్వం
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ సూచీలు నష్టాలతోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 74,883 పాయింట్ల వద్ద ప్రారంభమై క్రమంగా క్షీణించింది. ఇంట్రాడేలో 73,534.41 కనిష్ఠ స్థాయిని తాకిన తర్వాత చివరికి 1690.23 పాయింట్లు కోల్పోయి 73,583.22 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా అదే దిశలో కదిలింది. 486.85 పాయింట్లు పడిపోయి 22,819.60 వద్ద ముగిసింది.
వివరాలు
ఈ షేర్లకు భారీ నష్టం
ఎన్‌ఎస్‌ఈలో శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. మరోవైపు ఓఎన్జీసీ, టీసీఎస్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా షేర్లు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు సుమారు 3 శాతం వరకు పడిపోయాయి.
వివరాలు
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు తీవ్రతరమవుతుండటంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 107.97 డాలర్ల వద్ద ఉంది. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో భారీగా అమ్మకాలు జరగడం కూడా ప్రభావం చూపింది. రూపాయి విలువ క్షీణించడం మరో ప్రధాన కారణం. డాలర్‌తో పోలిస్తే రూపాయి 86 పైసలు పడిపోయి 94.82 వద్ద కొత్త జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. గత రెండు సెషన్లలో లాభాలు నమోదు కావడంతో, మదుపర్లు లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) వైపు మొగ్గుచూపడం కూడా మార్కెట్ల పతనానికి దారితీసింది.