
stock Market: భారీ నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభం .. సెన్సెక్స్ 3000 పాయింట్లు డౌన్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 3,233 పాయింట్ల నష్టంతో 72,130 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 1,022 పాయింట్ల నష్టంతో 21,882 వద్ద కొనసాగుతోంది.
ట్రంప్ టారిఫ్‌లు మార్కెట్ పై తీవ్రమైన ప్రభావం చూపడంతో సూచీలు గణనీయంగా పడిపోయాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఆంక్షల కారణంగా అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు విజృంభించాయి.
దీని ప్రభావంతో ప్రపంచ మార్కెట్ల మనోభావాలు బలహీనంగా మారాయి. ఈ వారం ఆ ప్రభావం ఇంకా స్పష్టంగా కనిపిస్తూ, ముందస్తు ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ ఒక దశలో 4,000 పాయింట్లకు పైగా పడిపోయింది.
వివరాలు
అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా మైనస్‌లో..
ఆసియా మార్కెట్లు ఇప్పటికే సోమవారం ఉదయం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
2008 ఆర్థిక మాంద్యానంతరం తొలిసారిగా ఇటువంటి తీవ్రమైన పతనాన్ని ఆసియా మార్కెట్లు ఎదుర్కొంటున్నాయి.
జపాన్ నిక్కీ సూచీ ఒక దశలో 8 శాతం వరకు పడిపోగా,ప్రస్తుతం 6 శాతం నష్టంతో ట్రేడవుతోంది.
తైవాన్ సూచీ 9.61 శాతం,దక్షిణ కొరియా కోస్పి 4.14 శాతం, చైనా షాంఘై సూచీ 6.5 శాతం,ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ సూచీ 3.82 శాతం మేర నష్టాల్లో ఉన్నాయి.
ఇక అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా మైనస్‌లో కొనసాగుతున్నాయి.డోజోన్స్ సూచీ 2.2 శాతం పడిపోయింది.
ఈ నేపథ్యంలో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాలను నమోదు చేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
రూ.20 లక్షల కోట్లు పైనే ఆవిరి
మరోవైపు, భారత గిఫ్ట్ నిఫ్టీ సూచీ 900 పాయింట్లకు పైగా పడిపోయింది.
దీని ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు ప్రారంభ ట్రేడింగ్‌లోనే భారీ నష్టాలను చవిచూశాయి.
సెన్సెక్స్ 3.5 శాతానికి పైగా క్షీణించగా, నిఫ్టీకి ఇది 2020 తర్వాత ఎదురైన అతి భారీ పతనం.
ఈ క్రమంలో నిఫ్టీలో నమోదు అయిన కంపెనీల కలిపి మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్లు పైనే ఆవిరైపోయింది.
అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశం ఉన్నదన్న భయాల నేపథ్యంలో లోహ రంగ షేర్లు బలమైన నష్టాలను ఎదుర్కొన్నాయి.