LOADING...
Stock market: స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ.. ఇన్వెస్టర్ల సంపదలో ₹10 లక్షల కోట్ల ఆవిరి
స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ.. ఇన్వెస్టర్ల సంపదలో ₹10 లక్షల కోట్ల ఆవిరి

Stock market: స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ.. ఇన్వెస్టర్ల సంపదలో ₹10 లక్షల కోట్ల ఆవిరి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి భారీ ఒత్తిడిలో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, చమురు ధరల పెరుగుదలతో పాటు విదేశీ పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐలు) భారీ అమ్మకాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ పరిణామాలతో సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్‌ దాదాపు 1500 పాయింట్లు పడిపోయింది. దీనివల్ల మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు ₹10 లక్షల కోట్లు తగ్గి రూ.429 లక్షల కోట్లకు చేరింది.

వివరాలు 

డాలర్‌తో రూపాయి మారకం విలువ 92.45గా నమోదు 

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్‌ ఉదయం 75,444.22 పాయింట్ల వద్ద (గత ముగింపు 76,034.42)నష్టాల్లో ప్రారంభమైంది. రోజు పొడవునా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సూచీ 74,454.60 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1470.50 పాయింట్ల భారీ నష్టంతో 74,563.92 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 488 పాయింట్లు పడిపోయి 23,151 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 92.45 వద్ద నమోదైంది. సెన్సెక్స్‌లోని 30 ప్రధాన స్టాక్స్‌లో హిందుస్థాన్ యూనిలీవర్‌, భారతీ ఎయిర్‌టెల్‌ తప్ప మిగతా అన్ని కంపెనీల షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, బీఈఎల్‌, మారుతీ సుజుకీ షేర్లు ఎక్కువగా పడిపోయాయి.

వివరాలు 

మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 100.61 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 5091 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఖమేనీ మరణం తర్వాత ఈ ఘర్షణ ఎక్కువకాలం సాగదని భావించినా, అది ప్రాంతీయ యుద్ధంగా విస్తరించడమే కాకుండా ఇప్పటికే రెండు వారాలు దాటింది. ఈ పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి.

Advertisement

వివరాలు 

చమురు ధరల పెరుగుదల

కొంతకాలం తగ్గిన చమురు ధరలు మళ్లీ 100 డాలర్ల మార్కును దాటాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిని ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చే సాధనంగా ఉపయోగిస్తామని మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు. యుద్ధం ముగిసే వరకు ఈ జలసంధి మూసివేత కొనసాగుతుందని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ప్రకటించడంతో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. రూపాయి పతనం చమురు ధరలు పెరగడం వల్ల భారత్ దిగుమతి బిల్లు పెరుగుతోంది. దీనివల్ల రూపాయి విలువపై ఒత్తిడి పెరిగి, అది ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది.

Advertisement

వివరాలు 

అమెరికా బాండ్ల రాబడులు పెరగడం

అమెరికాలో రెండేళ్ల కాలవ్యవధి గల బాండ్లపై రాబడులు ఆరు నెలల గరిష్ఠానికి చేరాయి. 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ కూడా గణనీయంగా పెరిగాయి. అమెరికా బాండ్లపై రాబడులు పెరిగితే, మనలాంటి వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ఎఫ్‌ఐఐల వరుస అమ్మకాలు దేశీయ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. గురువారం కూడా వారు రూ.7050 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. గత 10 ట్రేడింగ్ సెషన్లలో మొత్తం రూ.57 వేల కోట్లకు పైగా షేర్లను ఎఫ్‌ఐఐలు విక్రయించడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

Advertisement