LOADING...
Stock market: వరుస నష్టాలకు బ్రేక్‌.. మళ్లీ లాభాల్లోకి దేశీయ మార్కెట్ సూచీలు
వరుస నష్టాలకు బ్రేక్‌.. మళ్లీ లాభాల్లోకి దేశీయ మార్కెట్ సూచీలు

Stock market: వరుస నష్టాలకు బ్రేక్‌.. మళ్లీ లాభాల్లోకి దేశీయ మార్కెట్ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2025
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు మూడు రోజుల పాటు వరుసగా నష్టాలను నమోదు చేసిన అనంతరం, నేడు లాభాలతో ముగిశాయి. విదేశీ మార్కెట్‌ల్లో కనిపించిన సానుకూల వాతావరణం, ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగ షేర్లలో కొనుగోళ్ల పెరుగుదల సూచీలకు బలం చేకూర్చాయి. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ సమస్య పరిష్కార దశలోకి చేరుతుండడంతో గ్లోబల్ మార్కెట్లలోనూ మంచి భావన నెలకొంది. దీంతో మన మార్కెట్ సూచీలూ పైకెక్కాయి. మదుపర్ల ఆస్తి విలువగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ ఒకేరోజులో రూ.2 లక్షల కోట్లు పెరిగి రూ.468 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 83,198.20 పాయింట్ల వద్ద కాస్త నష్టంతో (గత ముగింపు 83,216.28) ప్రారంభమైనా, కొద్దిసేపటికే లాభాల్లోకి తిరిగింది.

వివరాలు 

రూపాయి-డాలర్ మారకం విలువ 88.71 

రోజంతా కొనుగోళ్ల ఒత్తిడి కొనసాగడంతో చివరకు 319.07 పాయింట్లు పెరిగి 83,535.35 పాయింట్ల వద్ద సెషన్ ముగిసింది. నిఫ్టీ కూడా 82.05 పాయింట్ల లాభంతో 25,574.35 వద్ద స్థిరపడింది. రూపాయి-డాలర్ మారకం విలువ 88.71 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో భాగమైన 30 ప్రధాన షేర్లలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, టీఎంపీవీ వంటి షేర్లు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. మరోవైపు ట్రెంట్, ఎటెర్నల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా & మహీంద్రా షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కో బ్యారెల్‌కు 64.09 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు 4,082 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.