Stock Market:ఇరాన్ ఉద్రిక్తతలతో కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు జరిగి, ఆ తరువాత ఏర్పడిన పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా కుదిపేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు,అంతేకాక చమురు ధరల పెరుగుదల కలిసి సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం నమోదైంది.సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 300పాయింట్లకు పైగా పడిపోయింది. ఉదయం 9.25గంటల సమయానికి Sensex 1,048.48పాయింట్లు పడిపోయి 80,238.71వద్ద ట్రేడవుతుండగా,Nifty 307.35 పాయింట్లు తగ్గి 24,871.30వద్ద కొనసాగింది. రూపాయి విలువ కూడా గణనీయంగా క్షీణించింది.ఈ రోజు ట్రేడింగ్‌లో రూపాయి 24పైసలు తగ్గి 91.32 వద్ద మార్పిడి అయింది. ప్రీ-ట్రేడింగ్ దశలోనే సెన్సెక్స్ సుమారు 2,700పాయింట్లు,నిఫ్టీ 530పాయింట్లు క్షీణించడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది.
వివరాలు
క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 80 డాలర్లకు పైగా ట్రేడవుతోంది
ప్రస్తుతం మార్కెట్లు కొంత మేర కోలుకున్నప్పటికీ, నష్టాల ప్రభావం మాత్రం కొనసాగుతోంది. ఇరాన్-అమెరికా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 80 డాలర్లకు పైగా ట్రేడవుతోంది. ఈ ప్రభావం దేశీయంగా చమురు సంబంధిత షేర్లపై స్పష్టంగా కనిపించింది. InterGlobe Aviation షేరు దాదాపు 5 శాతం మేర పడిపోయింది. అలాగే Maruti Suzuki, Asian Paints షేర్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఇక క్రితం ట్రేడింగ్ సెషన్‌లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.7,536 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ పరిణామాలన్నీ కలిసి దేశీయ మార్కెట్లలో ఆందోళన వాతావరణాన్ని కొనసాగిస్తున్నాయి.