LOADING...
Stock market: భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 
భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Stock market: భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిసాయి. భారత్-అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న అంచనాలు పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని పెంచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై సుంకాలు తగ్గించే అవకాశం ఉందని, వాణిజ్య ఒప్పందం త్వరలోనే పూర్తవుతుందని చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌కి మరింత ఊపునిచ్చాయి. దీనికితోడు అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ముగియబోతుందనే వార్తలు కూడా సెంటిమెంట్‌కు తోడ్పడ్డాయి.

వివరాలు 

సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది

దేశీయంగా చూస్తే, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందనే ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు కూడా మార్కెట్‌కు ఊతమిచ్చాయి. ముఖ్యంగా ఐటీ, ఆటోమొబైల్‌ రంగాలకు చెందిన షేర్లలో జరిగిన కొనుగోళ్లు సూచీలను పైకి నడిపించాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. పెట్టుబడిదారుల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.5 లక్షల కోట్లు పెరిగి రూ.473.6 లక్షల కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్‌ ఉదయం 84,238.86 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 83,871.32) లాభాలతో ప్రారంభమైంది.

వివరాలు 

 డాలర్‌తో రూపాయి మారకం విలువ 88.64గా నమోదు 

రోజంతా లాభాల దిశలోనే కదలింది. ఇంట్రాడేలో 84,652.01 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరికి 595.19 పాయింట్ల లాభంతో 84,466.51 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 180.85 పాయింట్లు పెరిగి 25,875.80 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 88.64గా నమోదైంది. సెన్సెక్స్‌-30లో ఏషియన్ పెయింట్స్‌, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు ప్రధాన లాభదారులుగా నిలిచాయి. మరోవైపు టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ (ప్యాసింజర్‌ & కమర్షియల్ వెహికల్స్‌), బీఈఎల్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 64.60 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,123 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.