Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. మళ్లీ 80వేల దిగువకు సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చే బలహీన సంకేతాలతో మన మార్కెట్లు నాలుగో రోజూ వరుసగా నష్టాల్లో కొనసాగాయి. తాజాగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినప్పటికీ, వచ్చే ఏడాది మార్కెట్ ఆశించిన స్థాయిలో రేట్ల కోత ఉండకపోవచ్చన్న సంకేతాలు ఇచ్చింది. దీనివల్ల మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడంతో సూచీలు రోజంతా నష్టాల్లోనే కదలాడాయి. సెన్సెక్స్ 80వేల పాయింట్ల దిగువకు చేరగా, ఒకే సెషన్‌లో మదుపర్ల సంపద దాదాపు రూ.3 లక్షల కోట్లు పోయింది. బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ క్షీణించి రూ.450 లక్షల కోట్లకు చేరింది.
జీవనకాల కనిష్ట స్థాయి 85.08 వద్ద ముగిసింది
సెన్సెక్స్ ఉదయం 79,029.03 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగింది. ఒక దశలో,సూచీ 1200 పాయింట్ల పతనమై 79,020.08 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి, 964.15 పాయింట్ల నష్టంతో 79,218.05 వద్ద ముగిసింది.నిఫ్టీ కూడా 247.15 పాయింట్ల నష్టంతో 23,951 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ట స్థాయి అయిన 85.08 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో సన్‌ఫార్మా,హిందుస్థాన్ యూనిలీవర్,పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఫిన్‌సర్వ్,జేఎస్‌డబ్ల్యూ స్టీల్,ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 73 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2635 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
కారణాలు ఇవే..
వచ్చే ఏడాది (2025)ముగ్గురు రేట్ల కోతలను మార్కెట్లు అంచనా వేయగా,ఫెడ్ కేవలం రెండు సార్లు మాత్రమే కోత ఉండే సంకేతాలు ఇచ్చింది. ఇది మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేసింది. ఫెడ్ నిర్ణయంతో, అమెరికా ప్రధాన సూచీలు అయిన ఎస్‌అండ్‌పీ 500,నాస్‌డాక్ కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ప్రభావం మన మార్కెట్లతో పాటు ఇతర ప్రధాన మార్కెట్లపైనా పడ్డింది.విదేశీ సంస్థాగత మదుపర్లు గత మూడు సెషన్లలో దాదాపు రూ.8వేల కోట్లను మన ఈక్విటీ మార్కెట్ల నుంచి వెనక్కు తీసుకున్నారు. ఈ ప్రభావానికి అమెరికా డాలర్ బలపడడం మరియు బాండ్ల రాబడి పెరగడం కారణం. అందువల్ల, మన మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. రూపాయి విలువ మరింత క్షీణించడం కూడా మరో కారణంగా నిలిచింది.