Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం స్థిరంగా ముగిశాయి. అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, దేశీయంగా మార్కెట్‌ను ముందుకు నడిపించే స్పష్టమైన అంశాలు లేకపోవడంతో సూచీలు పరిమిత శ్రేణిలోనే కదిలాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్, మెటల్, ఆటో రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, ఐటీ,ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ క్రితం ముగింపు 84,695.54తో పోలిస్తే స్వల్ప నష్టాల్లో 84,600.99పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 84,470.94 నుంచి 84,806.99 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరికి 20.46పాయింట్ల నష్టంతో 84,675.08 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 3.25 పాయింట్లు తగ్గి 25,938.85వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 89.84గా కొనసాగింది.
వివరాలు
బంగారం ఔన్సు ధర 4,390 డాలర్లు
సెన్సెక్స్ 30 సూచీలో ఎటెర్నల్, ఇండిగో, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ప్రధానంగా నష్టాలను చవిచూశాయి. మరోవైపు టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 61.59 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,390 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.