Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 1097 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ ఒత్తిడికి గురయ్యాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో లాభాల దిశగా సాగిన సూచీలు, ఒక్క రోజే గడవకముందే మళ్లీ బేర్ ప్రభావంలోకి వెళ్లాయి. ఫలితంగా సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లకు పైగా పడిపోయింది. ఇక నిఫ్టీ కూడా 24,500 మార్క్‌కు దిగువన ముగిసింది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్న భయాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. "అసలు యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది" అంటూ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచాయి.
వివరాలు
నిఫ్టీ @ 24,450
సెన్సెక్స్ ఉదయం 79,658.99 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అంతకు ముందు రోజు ముగింపు 80,015.90 వద్ద ఉండగా, మొదటి నుంచే నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. రోజంతా సూచీ నష్టాల దిశలోనే కొనసాగింది. ప్రారంభంలో కొంత మోస్తరు నష్టాల్లో ఉన్న మార్కెట్, చివరి గంటల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మరింతగా పడిపోయింది. ఈ క్రమంలో ఇంట్రాడేలో సెన్సెక్స్ 78,812.18 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 1097 పాయింట్లు కోల్పోయి 78,918.90 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 315.45 పాయింట్లు పడిపోయి 24,450.45 వద్ద స్థిరపడింది.
వివరాలు
డాలర్‌తో రూపాయి మారకం విలువ 91.74గా నమోదు
ఇదే సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 91.74 వద్ద ఉంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీలలో ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అయితే బీఈఎల్, రిలయన్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు మాత్రం లాభాల్లో నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 86.98 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సుకు 5082 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
కారణాలు ఇవీ..
పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు త్వరగా తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అసలు యుద్ధం ఇప్పుడు మొదలైందని అమెరికా రక్షణ మంత్రి వ్యాఖ్యానించడంతో మార్కెట్లలో ఆందోళన మరింత పెరిగింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్‌పై జరిగే యుద్ధానికి ఎలాంటి కాలపరిమితి నిర్ణయించలేదని చెప్పడం, ఈ సంఘర్షణ ఎక్కువకాలం కొనసాగొచ్చన్న భావనను బలపరిచింది. దీనివల్ల పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింది. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగబాకుతున్నాయి. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌కు ఇది ప్రతికూలంగా మారే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న, ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడవచ్చన్న భయాలు కూడా పెరిగాయి.
వివరాలు
కారణాలు ఇవీ..
ఇంకొకవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) అమ్మకాల ధోరణిని కొనసాగిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ వెల్లడించిన వివరాల ప్రకారం, నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో ఎఫ్‌ఐఐలు రూ.3,762 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇక మార్చి నెలలోనే మొత్తం రూ.21,436 కోట్ల విలువైన షేర్లను విదేశీ పెట్టుబడిదారులు అమ్మడం కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.