
Stock market: ట్రంప్ ప్రభావంతో.. భారత ఇన్వెస్టర్లకు రూ.45లక్షల కోట్ల రూపాయలు ఆవిరి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారతీయ పెట్టుబడిదారుల సంపదలో భారీ నష్టం సంభవించింది.
తాజా గణాంకాల ప్రకారం, భారత్‌లో సుమారు రూ.45.57 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయింది.
జనవరి 20నాటికి దేశంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,31,59,726 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం అది రూ.3,86,01,961 కోట్లకు తగ్గిపోయింది.
మార్కెట్‌లో అస్థిరత,పెట్టుబడిదారుల్లో భయాన్ని సూచించే విక్స్ సూచీ భారీగా పెరిగింది.
ఉదయం 11:37 గంటల సమయంలో నిఫ్టీ 851 పాయింట్లు కోల్పోయి 22,052 స్థాయిలో, అలాగే సెన్సెక్స్ 2,638 పాయింట్లు పడిపోయి 72,744 వద్ద కొనసాగుతున్నాయి.
వివరాలు
ఒక్కరోజే రూ.20 లక్షల కోట్ల నష్టం!
సోమవారం ఒక్కరోజే పెట్టుబడిదారుల సంపదలో రూ.20.16 లక్షల కోట్ల మేర నష్టం నమోదైంది.
సెన్సెక్స్ ఒక దశలో 5.22 శాతం మేరకు పతనమైంది. బీఎస్‌ఈలో లిస్టయ్యిన కంపెనీల మొత్తం విలువ 4.5 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది.
టాటా స్టీల్, టాటా మోటార్స్ షేర్లు 10 శాతానికి పైగా నష్టపోయాయి. అలాగే, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు కూడా భారీ నష్టాన్ని చవిచూశాయి.
వివరాలు
అబ్బో ఇవేం గణాంకాలు..
బీఎస్‌ఈలో లిస్టయ్యిన 725 కంపెనీల షేర్లు నేటి ట్రేడింగ్‌లో 52 వారాల కనిష్ఠాలను తాకాయి.
వీటిలో భారత్ ఫోర్జ్, బాటా ఇండియా, బజాజ్ ఆటో, డాబర్ ఇండియా వంటి కంపెనీలు ఉన్నాయి.
అంతేకాదు, 517 కంపెనీల షేర్లు నేరుగా లోయర్ సర్క్యూట్‌కు వెళ్లిపోయాయి. ఇది మార్కెట్‌లో నెలకొన్న తీవ్రమైన ఒడిదుడుకులను సూచిస్తుంది.
వివరాలు
రూపాయి విలువ కూడా పతనం..
నేటి మార్కెట్ సెషన్‌లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 19 పైసలు పడిపోయి రూ.85.63కి చేరింది.
ప్రపంచ వాణిజ్య యుద్ధం ఉత్కంఠను నెలకొల్పడంతో.. ముఖ్యంగా అమెరికా, చైనా పరస్పరం భారీ పన్నులు విధించుకోవడం వల్ల..ఈ పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తలపెట్టిన సమావేశంపై పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బుధవారం నాడు కేంద్ర బ్యాంకు తీసుకునే నిర్ణయాలు రూపాయి దిశను నిర్దేశించే అవకాశం ఉంది.
నిపుణుల అంచనాల ప్రకారం, ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశముంది.