Stock Market: భారీ లాభాలతో కొత్త ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ల శుభారంభం.. రూ.9.60 లక్షల కోట్లు పెరిగిన సంపద
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ఆరంభించాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు,అలాగే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు ఈ ఉత్సాహానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఇదే సమయంలో ముడి చమురు ధరలు కొంత తగ్గడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర 2.51 శాతం తగ్గి బ్యారెల్‌కు 101.39 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సెటిల్‌మెంట్ హాలీడే కారణంగా బుధవారం కరెన్సీ మార్కెట్లు పనిచేయలేదు. ఆసియా మార్కెట్లు అన్నీ లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లు కూడా సానుకూలంగా ప్రారంభమయ్యాయి.
వివరాలు
జోరుగా ప్రారంభమైన మార్కెట్లు
మదుపర్ల సంపదను ప్రతిబింబించే బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.9.60 లక్షల కోట్లు పెరిగి రూ.422.01 లక్షల కోట్లకు (సుమారు 4.46 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ గత ముగింపు 71,947.55 పాయింట్లతో పోలిస్తే భారీగా పెరిగి 73,762.43 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో 73,964.58 పాయింట్లను తాకి ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆపై స్వల్పంగా తగ్గినా, చివరికి 1186.77 పాయింట్ల లాభంతో 73,134.32 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 348 పాయింట్లు పెరిగి 22,679.40 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 22,618.60 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని, 22,941.30 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది.
వివరాలు
కొద్దిపాటి షేర్లు మాత్రమే నష్టాల్లో
సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో కేవలం 5 షేర్లు మాత్రమే నష్టాల్లో ముగియగా, మిగతా అన్నీ లాభాల్లో నిలిచాయి. ట్రెంట్ 7 శాతం,అదానీ పోర్ట్స్ 5.47 శాతం,భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 4.54 శాతం,ఎస్‌బీఐ 3.89 శాతం, ఎటర్నల్ 3.34 శాతం, ఎల్‌అండ్‌టీ 2.95 శాతం,టైటన్ 2.81 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.75 శాతం మేర పెరిగాయి. అదే సమయంలో ఎన్‌టీపీసీ 1.64 శాతం, సన్ ఫార్మా 1.64 శాతం, పవర్‌గ్రిడ్ 1.13 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.29 శాతం,భారతీ ఎయిర్‌టెల్ 0.13 శాతం తగ్గాయి. బీఎస్‌ఈ రంగాల సూచీల్లో సర్వీసెస్, పీఎస్‌యూ బ్యాంకులు, ఇండస్ట్రియల్స్, భారీ యంత్రాలు, కమోడిటీస్, ఐటీ రంగాలు మెరుగ్గా రాణించాయి. అయితే ఆరోగ్య సంరక్షణ రంగం మాత్రం వెనుకబడి కనిపించింది.
వివరాలు
ఎయిర్‌లైన్ షేర్లలో ఉత్సాహం
విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు స్వల్పంగా మాత్రమే పెరగడం విమానయాన రంగానికి ఊరటనిచ్చింది. దీంతో ఆ రంగంలోని షేర్లకు కొనుగోళ్లు పెరిగాయి. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు 6.01 శాతం పెరగగా, స్పైస్‌జెట్ షేరు 1.95 శాతం లాభపడింది.