Stock market: అంతర్జాతీయ ప్రభావాలతో కుదేలైన మార్కెట్లు .. సెన్సెక్స్ 1400 పాయింట్ల పతనం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ మార్కెట్ల లాభాల మురిపెం ఒక్కరోజుకే పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచాయి. అదనంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ఈ ప్రభావంతో గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ కీలకమైన 22,500 స్థాయిని కోల్పోయింది. ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్ 1454.53 పాయింట్లు తగ్గి 71,679.79 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 453.9 పాయింట్లు పడిపోయి 22,222.50 వద్ద ట్రేడ్ అవుతోంది.
వివరాలు
బలపడిన రూపాయి
నిఫ్టీ సూచీలో సన్ ఫార్మా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎటర్నల్ వంటి షేర్లు ప్రధానంగా నష్టాలను నమోదు చేస్తున్నాయి. ఇక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని మార్కెట్లు కూడా బలహీనంగానే ఉన్నాయి. జపాన్ నిక్కీ సూచీ 1.4 శాతం పడిపోగా, దక్షిణ కొరియా కోస్పి 2.82 శాతం నష్టపోయింది. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.48 శాతం తగ్గగా, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 0.5 శాతం మేర క్షీణించింది. అమెరికా స్టాక్ మార్కెట్లు మాత్రం బుధవారం పెద్దగా మార్పులు లేకుండా ముగిశాయి. ఇటీవలి రోజులుగా బలహీనంగా కొనసాగుతున్న రూపాయి విలువ గురువారం గణనీయంగా పుంజుకుంది. నేటి ట్రేడింగ్‌లో రూపాయి 105 పైసలు లాభపడి డాలర్‌తో పోలిస్తే 93.65 వద్ద ట్రేడ్ అవుతోంది.