IndiGo: ఇండిగో గందరగోళం వేళ.. మీ క్రెడిట్ కార్డ్ / OTA బుకింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని కాపాడవచ్చు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండిగో ఎయిర్‌లైన్స్ పెద్దఎత్తున విమానాలను రద్దు చేయడం, ఆలస్యం కావడం వల్ల దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలలో తీవ్ర గందరగోళం నెలకొంది. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుని తమ హక్కులేంటో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ 5న ఒక్కరోజే 700కుపైగా విమానాలు రద్దయ్యాయి. ఇది వరుసగా నాలుగో రోజు కూడా కొనసాగింది. అత్యంత తీవ్రంగా ప్రభావితమైందీ ఢిల్లీ విమానాశ్రయం, అక్కడ ఆ రోజుకు షెడ్యూల్ చేసిన ఇండిగోకు చెందిన అన్ని విమానాలూ పూర్తిగా రద్దయ్యాయి. గడిచిన నాలుగు రోజుల్లో మొత్తం 1,000కు పైగా విమానాలు రద్దు కావడంతో, ప్రయాణికుల ప్రణాళికలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. బెంగళూరు విమానాశ్రయంలో మాత్రమే 102 విమానాలు రద్దయ్యాయని సమాచారం.
వివరాలు
"ట్రావెల్ ఇన్సూరెన్స్" ఎంతో ఉపయోగకరం
అంతకుముందు రోజుల్లో డిసెంబర్ 4న 99, డిసెంబర్ 3న 62, డిసెంబర్ 2న 20 విమానాలు రద్దైనట్లు వెల్లడైంది. దేశంలోని అతిపెద్ద విమాన సంస్థ అయిన ఇండిగో సిబ్బంది కొరత, షెడ్యూలింగ్ ఒత్తిడి కారణంగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటుండగా, ఒక్కసారి ఆలస్యం జరిగినా ప్రయాణికులకు ఎంతటి ఆర్థిక భారం ఏర్పడుతుందో ఇప్పుడు బహిర్గతమవుతోంది. ఇలాంటి వేళలో ఎక్కువ మంది పట్టించుకోని "ట్రావెల్ ఇన్సూరెన్స్" ఎంతో ఉపయోగకరంగా మారింది. స్వతంత్రంగా తీసుకున్నా, ఓటీఏ వెబ్‌సైట్ల ద్వారా టిక్కెట్లకు జత చేసుకున్నా లేదా కొన్ని క్రెడిట్ కార్డులతో ఉచితంగా లభించినా, ఈ ఇన్సూరెన్స్ విమానాల ఆలస్యం, రద్దుల వల్ల కలిగే ఖర్చులను కొంత మేర తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
ఆలస్యం ఒక నిర్దిష్ట సమయాన్ని మించితే..
ప్రయాణం పూర్తిగా రద్దయినా లేదా మధ్యలో నిలిచిపోయినా,తిరిగి రాకుండా పోయే విమానటిక్కెట్లు, హోటల్ బుకింగ్స్, ముందుగా చెల్లించిన కార్యక్రమాల ఖర్చులకు రక్షణ కల్పిస్తుంది. అలాగే, ఆలస్యం ఒక నిర్దిష్ట సమయాన్ని మించితే ఫ్లైట్ డిలే అలవెన్స్ పేరుతో స్థిరమొత్తాన్ని చెల్లిస్తారు, చాలా పాలసీల్లో ఖర్చు బిల్లులు చూపాల్సిన అవసరం ఉండదు అని ఇండియా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర భరింద్వాల్ తెలిపారు. దేశీయ ప్రయాణాల్లో విమానం ఆలస్యమైతే ప్రయాణికులు పొందే సగటు క్లెయిమ్ మొత్తం రూ.1,000 నుంచి రూ.5,000 మధ్యే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే,ప్రయాణం పూర్తిగా రద్దయితే టిక్కెట్లు,హోటల్ బుకింగ్స్ లాంటి తిరిగి తిరిగి రాబోని ఖర్చుల ఆధారంగా క్లెయిమ్ మొత్తం మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
వివరాలు
క్రెడిట్ కార్డుల్లో దాదాపు 8 శాతం కార్డుల్లో ఈ సదుపాయం
చిక్కుకుపోయిన ప్రయాణికులు తొలుత చేయాల్సిన సులభమైన పని తమ వద్ద ఉన్న క్రెడిట్ కార్డుతో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉందా లేదా చూసుకోవడం. భారత్‌లో ఉన్న 650 రకాల క్రెడిట్ కార్డుల్లో దాదాపు 8 శాతం కార్డుల్లో ఈ సదుపాయం ఉన్నప్పటికీ, చాలా మందికి దీని గురించి తెలియదని కవర్‌స్యూర్ సీఈవో సౌరభ్ విజయ్‌వర్గియా తెలిపారు. మేక్‌మైట్రిప్, క్లియర్‌ట్రిప్, లేదా ఇండిగో వెబ్‌సైట్‌లాంటి ఓటీఏల ద్వారా టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు తెలియకుండానే ఇన్సూరెన్స్ తీసుకునే వారు చాలామంది ఉన్నా, వాటి నిబంధనలు వేర్వేరుగా ఉండటంతో జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక, ఇన్సూరెన్స్‌కు ముందే, డీజీసీఏ నిబంధనల ప్రకారం ప్రయాణికులకు కొన్ని హక్కులు ఉన్నాయి.
వివరాలు
ఎక్కువ సేపు ఆలస్యం అయితే హోటల్ వసతి, రవాణా ఏర్పాట్లు
చెక్-ఇన్ తర్వాత విమానం రద్దయితే ఫుల్ రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ విమానం ఇవ్వాలి, అలాగే విమానాశ్రయంలో ఉన్న వారికి భోజనం, తాగునీరు అందించాలి. ఎక్కువ సేపు ఆలస్యం అయితే హోటల్ వసతి, రవాణా ఏర్పాట్లు కూడా కల్పించాల్సి ఉంటుంది. ఇది ఇన్సూరెన్స్ ఉన్నా లేకున్నా అన్ని ప్రయాణికులకు వర్తిస్తుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం బోర్డింగ్ పాస్, ఎయిర్‌లైన్ పంపిన ఆలస్యం లేదా రద్దు మెయిల్, భోజనం, హోటల్ లేదా ప్రత్యామ్నాయ టిక్కెట్ రసీదులు సేకరించి, వెంటనే బ్యాంక్ లేదా ఇన్సూరెన్స్ సంస్థకు సమాచారం ఇవ్వాలని సలహా ఇస్తున్నారు.
వివరాలు
45 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ చేయాలి
సాధారణంగా 48 గంటల్లో విచారణ నమోదు చేసి, 45 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ చేయాల్సి ఉంటుంది. చాలా పాలసీల్లో ఆలస్యం కనీసం ఆరు గంటలు దాటినప్పుడే పరిహారం చెల్లిస్తారని, ఆ సమయం మించాక నిర్ణీత మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుందని బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రతినిధి రాకేష్ కౌల్ తెలిపారు.