Tata Group: పాకిస్థాన్ జీడీపీని అధిగమించిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ
టాటా గ్రూప్ మార్కెట్ విలువ ఏడాది కాలంగా భారీగా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం టాటా గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా పాకిస్థాన్ జీడీపీని దాటేసింది. టాటా గ్రూప్‌కు చెందిన చాలా కంపెనీలు గతేడాది భారీ ఆదాయాన్ని ఆర్జించాయి. దీని కారణంగా ప్రస్తుతం టాటా గ్రూప్ మార్కెట్ విలువ 365బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం పాకిస్థాన్ స్థూల జాతీయోత్పత్తి (GDP) 341 బిలియన్ డాలర్లు కాగా.. ఇప్పుడు పాక్ జీడీపీని టాటా గ్రూప్ అధిగమించిపోయింది. టాటా గ్రూప్‌కు చెందిన టీసీఎస్ మార్కెట్ విలువ 170 బిలియన్ డాలర్లు, ఇది పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగం పరిమాణం. టీసీఎస్ దేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా గుర్తింపు పొందింది.
టాటా గ్రూప్ మార్కెట్ విలువ పెరగడంలో ఈ కంపెనీల సహకారం
టాటా గ్రూప్ మార్కెట్ విలువను పెంచడంలో సహకరించిన కంపెనీలలో టాటా మోటార్స్, ట్రెంట్ వంటి కంపెనీలు ఉన్నాయి. టైటాన్, టీసీఎస్, టాటా పవర్ షేర్ల పెరుగుదల కూడా గ్రూప్ మార్కెట్ విలువ పెరగడానికి దోహదపుడుతుంది. టీఆర్ఎఫ్, ట్రెంట్, బనారస్ హోటల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా, ఆర్ట్‌సన్ ఇంజనీరింగ్‌తో సహా టాటా గ్రూప్‌లోని 8 కంపెనీల సంపద విలువ ఏడాదిలోనే ఏకంగా రెండింతలు పెరిగింది. టాటా గ్రూప్ శరవేగంగా పురోగమిస్తుంటే.. మరోవైపు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో పయనిస్తోంది. పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు కూడా 8బిలియన్ డాలర్ల వద్ద మాత్రమే ఉన్నాయి. భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు పాకిస్థాన్ కంటే 77రెట్లు ఎక్కువగా ఉన్నాయి.