Page Loader
స్నాక్ కంపెనీలపై టాటాల ఆసక్తి.. హల్దీరామ్స్‌లో 51 శాతం వాటా కొనుగోలు కోసం చర్చలు
హల్దీరామ్స్‌లో 51 శాతం వాటా కోసం చర్చలు

స్నాక్ కంపెనీలపై టాటాల ఆసక్తి.. హల్దీరామ్స్‌లో 51 శాతం వాటా కొనుగోలు కోసం చర్చలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 06, 2023
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ స్నాక్ తయారీ సంస్థ హల్దీరామ్స్ కంపెనీపై భారత వ్యాపార దిగ్గజం టాటా కన్నెసింది. ఈ మేరకు సదరు ఆహార సంస్థలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ప్యాకేజీ ఫుడ్‌ బిజినెస్‌లో రాణించాలని భావిస్తున్న టాటా గ్రూప్‌కు హల్దీరామ్స్‌ వాల్యుయేషన్‌ ఎక్కువగా పేర్కొనడంపై దిగ్గజ బిజినెస్ టైకూన్ అనాసక్తిగా ఉన్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చకు దారితీసింది. హల్దీరామ్స్‌లో దాదాపు 51 శాతం వాటాల కొనుగోలుకు టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీ చర్చలు సాగిస్తున్నట్లు అంచనా. హల్దీరామ్ 10 బిలియన్‌ డాలర్ల వాల్యుయేషన్‌ని ప్రకటించినట్లు సమాచారం. హల్దీరామ్ విలువ చాలా ఎక్కువగా చూపిస్తున్నట్లు టాటా యాజమాన్యం లెక్కలేస్తున్నట్లు అంచనా.

details

స్నాక్స్ మార్కెట్లో 13 శాతం వాటా కలిగిన హల్దీరామ్స్

అయితే ఈ వ్యవహారంపై టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు. ఒకవేళ టాటా - హల్దీరామ్స్‌ చర్చలు ఫలవంతమైతే స్నాక్స్ వ్యాపారంలో లేస్‌ విక్రయిస్తున్నపెప్సీకి, టాటా స్ట్రాంగ్ పోటీనివ్వనుంది. మరోవైపు 10 శాతం వాటా విక్రయానికి ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బెయిన్‌ క్యాపిటల్‌తోనూ స్నాక్ కంపెనీ హల్దీరామ్స్‌ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూప్‌ టెట్లీ, టాటా సాల్ట్‌, హిమాలయన్‌ ఉత్పత్తులను విక్రయిస్తోంది. 1937లో ఓ చిన్న కిరాణా కొట్టుగా ప్రారంభమైన హల్దీరామ్స్‌, ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద స్నాక్స్‌ కంపెనీగా ఎదిగి 13 శాతం మార్కెట్‌ వాటాను ఒడిసిపట్టింది. సింగపూర్‌, యూఎస్‌ఏ సహా ఇతర స్నాక్స్ మార్కెట్లలోనూ హల్దీరామ్స్‌ ఉత్పత్తుల జోరు కనిపిస్తుండటం విశేషం.