Loading...
Brand Finance India 2026: దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా.. అదానీకి టాప్-10లో చోటు
దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా.. అదానీకి టాప్-10లో చోటు

Brand Finance India 2026: దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా.. అదానీకి టాప్-10లో చోటు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2026
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత కార్పొరేట్ రంగంలో టాటా గ్రూప్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా 18వ ఏడాది కూడా దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. అదే సమయంలో అదానీ గ్రూప్ ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో విశేష ప్రగతి సాధించి తొలిసారిగా టాప్-10 అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ వివరాలను 'బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా 100-2026' నివేదిక వెల్లడించింది.

వివరాలు 

భారత బ్రాండ్ల విలువకు ఊపు

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పటికీ భారత కంపెనీలు బలమైన వృద్ధిని నమోదు చేశాయని నివేదిక పేర్కొంది.

దేశంలోని 100 అత్యంత విలువైన బ్రాండ్ల మొత్తం విలువ ఏడాది కాలంలో 7 శాతం పెరిగి 252.8 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.24.34 లక్షల కోట్లు) చేరింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ (ఏఐ), పునరుత్పాదక ఇంధనం వంటి భవిష్యత్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థల బ్రాండ్ విలువ గణనీయంగా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

వివరాలు 

టాటాదే అగ్రస్థానం

టాటా గ్రూప్ తన నంబర్‌వన్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే 6 శాతం వృద్ధితో సంస్థ బ్రాండ్ విలువ 33.6 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.24 లక్షల కోట్లు) చేరింది.

ఎలక్ట్రానిక్స్, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్,ఎలక్ట్రిక్ మొబిలిటీ,సెమీకండక్టర్లు వంటి భవిష్యత్ అవసరాల రంగాలపై దృష్టి పెట్టడం టాటాకు కలిసి వచ్చిన ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది.

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 16.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.58 లక్షల కోట్లు) బ్రాండ్ విలువతో వరుసగా ఐదో ఏడాది రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఎల్‌ఐసీ 12 శాతం వృద్ధితో 15.3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.47 లక్షల కోట్లు) బ్రాండ్ విలువ సాధించి మూడో స్థానంలో నిలిచింది.

ADVERTISEMENT

వివరాలు 

సంచలనం సృష్టించిన అదానీ

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ సుమారు రూ.1.33 లక్షల కోట్ల బ్రాండ్ విలువతో నాలుగో స్థానాన్ని దక్కించుకోగా, రిలయన్స్ గ్రూప్ దాదాపు రూ.1.03 లక్షల కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది.

అనంతరం ఎస్‌బీఐ గ్రూప్ (రూ.94,229 కోట్లు), హెచ్‌సీఎల్‌టెక్ (రూ.86,541 కోట్లు) వరుస స్థానాలను సొంతం చేసుకున్నాయి.

ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో అత్యంత చర్చనీయాంశంగా నిలిచింది అదానీ గ్రూప్ ప్రదర్శన. సంస్థ బ్రాండ్ విలువ 31శాతం పెరిగి 8.5 బిలియన్ డాలర్లకు చేరడంతో తొలిసారిగా టాప్-10 జాబితాలో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది.

మౌలిక సదుపాయాలు, ఇంధన రంగం, విమానాశ్రయాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో దూకుడుగా విస్తరించడం ఈ వృద్ధికి ప్రధాన కారణమని నివేదిక తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

వేగవంతమైన వృద్ధిలో సుజ్లాన్ టాప్

లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) 8.3 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో తొమ్మిదో స్థానంలో నిలవగా, ఎయిర్‌టెల్ 8.1 బిలియన్ డాలర్లతో పదో స్థానాన్ని దక్కించుకుంది.

అత్యంత వేగంగా బ్రాండ్ విలువ పెంచుకున్న సంస్థగా సుజ్లాన్ ఎనర్జీ నిలిచింది. ఈ సంస్థ బ్రాండ్ విలువ ఏకంగా 114 శాతం పెరిగి 418 మిలియన్ డాలర్లకు చేరింది.

అదానీ పవర్ 152 శాతం వృద్ధితో 1.8 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ సాధించడం మరో విశేషం.

యెస్ బ్యాంక్ 79 శాతం, జేఎస్‌డబ్ల్యూతో పాటు దాని గ్రూప్ కంపెనీలు 55 శాతం వృద్ధిని నమోదు చేసి వేగంగా ఎదుగుతున్న బ్రాండ్ల జాబితాలో చోటు సంపాదించాయి.

వివరాలు 

బ్రాండ్ స్ట్రెంగ్త్‌లో తాజ్ హోటల్స్ నంబర్‌వన్

బ్రాండ్ విలువతో పాటు వినియోగదారుల విశ్వాసం, గుర్తింపు, మార్కెట్ ప్రభావాన్ని ప్రతిబింబించే 'బ్రాండ్ స్ట్రెంగ్త్' విభాగంలో తాజ్ హోటల్స్ వరుసగా ఐదోసారి దేశంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రాండ్‌గా నిలిచింది.

జొమాటో, అమూల్ రెండో, మూడో స్థానాలను దక్కించుకున్నాయి.

అదే సమయంలో ఐటీ సేవల విభాగంలో టీసీఎస్ 21.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో దేశంలో అగ్రస్థానాన్ని కొనసాగించింది.

అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్లలో రెండో స్థానాన్ని కూడా నిలబెట్టుకోవడం విశేషం.

ADVERTISEMENT