Loading...
Tata Group stocks: టాటా గ్రూప్‌లో ఛైర్మన్‌ వివాదం.. షేర్లలో భారీ పతనం.. ఏకంగా 8 శాతం డౌన్
టాటా గ్రూప్‌లో ఛైర్మన్‌ వివాదం.. షేర్లలో భారీ పతనం.. ఏకంగా 8 శాతం డౌన్

Tata Group stocks: టాటా గ్రూప్‌లో ఛైర్మన్‌ వివాదం.. షేర్లలో భారీ పతనం.. ఏకంగా 8 శాతం డౌన్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌లో ఛైర్మన్‌ పదవికి సంబంధించిన వివాదం ఆ సంస్థల షేర్లపై ప్రభావం చూపుతోంది. ఎన్‌.చంద్రశేఖరన్‌ కొనసాగింపుపై నెలకొన్న పరిణామాలతో శుక్రవారం ఉదయం టాటా గ్రూప్‌ కంపెనీల్లో అమ్మకాలు పెరిగాయి. ఫలితంగా పలు షేర్లు భారీగా నష్టపోగా.. కొన్ని స్టాక్స్‌ ఏకంగా 8 శాతం వరకు క్షీణించాయి. ఉదయం 9.40 గంటల సమయంలో టాటా కెమికల్స్‌ షేరు 8 శాతం నష్టపోయి రూ.716.65 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ షేరు కూడా 5 శాతం వరకు క్షీణించి రూ.682.55కు చేరింది.

వివరాలు 

టీసీఎస్‌, టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ షేర్లకూ నష్టాలు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) షేరు 3.41 శాతం పడిపోయి రూ.2,115.40 వద్దకు చేరింది.

టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ షేరు 3.34 శాతం క్షీణించి రూ.304కు చేరింది. టాటా పవర్‌ 2.20 శాతం, టాటా కమర్షియల్‌ వెహికల్స్‌ 1.35 శాతం వరకు నష్టపోయాయి.

టాటా స్టీల్‌ షేరు దాదాపు 1 శాతం క్షీణించి రూ.185.66కు చేరింది. టాటా టెక్నాలజీస్‌ షేరు 2.73 శాతం వరకు పడిపోయింది.

ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ, టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ షేర్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి.

టాటా గ్రూప్‌నకు చెందిన కంపెనీల పనితీరును ప్రతిబింబించే నిఫ్టీ ఇండియా కార్పొరేట్‌ గ్రూప్‌ ఇండెక్స్‌-టాటా గ్రూప్‌ కూడా 1.14 శాతం నష్టపోయింది. దీంతో ఈ సూచీ 13,855.45 స్థాయికి చేరింది.

వివరాలు 

వివాదానికి కారణమేంటి?

చంద్రశేఖరన్‌ ఛైర్మన్‌గా కొనసాగడంపై ఏర్పడిన వివాదమే ఈ అమ్మకాల ఒత్తిడికి ప్రధాన కారణమని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.

మరోసారి ఛైర్మన్‌ పదవికి పోటీ చేయకూడదన్న తన నిర్ణయాన్ని పునఃపరిశీలించేందుకు చంద్రశేఖరన్‌ అంగీకరించినట్లు టాటా సన్స్‌ గురువారం ప్రకటించింది.

బోర్డు మెజారిటీ ఓట్లతో ఆయనను మరో ఐదేళ్లపాటు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

అయితే, ఈ పునర్నియామకాన్ని చట్టవిరుద్ధమని టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ నోయెల్‌ టాటా పేర్కొన్నట్లు సమాచారం.

టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు మెజారిటీ వాటా ఉండటంతో.. ఈ పరిణామాలు మార్కెట్‌లో ఆందోళనకు దారితీశాయి.

ADVERTISEMENT