Loading...
Tata Trusts: టాటా సన్స్‌లో మళ్లీ వివాదం.. చంద్రశేఖరన్ నియామకంపై కోర్టుకు ట్రస్టులు
టాటా సన్స్‌లో మళ్లీ వివాదం.. చంద్రశేఖరన్ నియామకంపై కోర్టుకు ట్రస్టులు

Tata Trusts: టాటా సన్స్‌లో మళ్లీ వివాదం.. చంద్రశేఖరన్ నియామకంపై కోర్టుకు ట్రస్టులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత పారిశ్రామిక దిగ్గజ సంస్థ టాటా సన్స్‌లో నాయకత్వానికి సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సంస్థ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరోసారి నియమించడాన్ని సవాలు చేస్తూ టాటా ట్రస్టులు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని, మొత్తం రూ.65 కోట్ల నష్టపరిహారంతో పాటు వడ్డీ చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయపరమైన చర్యలు చేపట్టాయి. ఎన్డీటీవీ ప్రాఫిట్ కథనం ప్రకారం.. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (ఎస్‌డీటీటీ), రతన్ టాటా ట్రస్ట్ (ఆర్‌డీటీటీ) ఈ నెల 25న ఈ మేరకు తీర్మానాలు ఆమోదించాయి. 2027 ఫిబ్రవరి 21 నుంచి మరో ఐదేళ్ల పాటు ఎన్. చంద్రశేఖరన్‌ను టాటా సన్స్ ఛైర్మన్‌గా కొనసాగించాలని సెప్టెంబర్ 17న సంస్థ బోర్డు నిర్ణయించింది.

వివరాలు 

ఈ నిబంధనను పాటించలేదు 

అయితే ఈ పునర్నియామక ప్రక్రియ చెల్లదని ట్రస్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 121 ప్రకారం.. సంస్థకు సంబంధించిన కీలకమైన బోర్డు నిర్ణయాలు తీసుకునేటప్పుడు టాటా ట్రస్టులు నామినేట్ చేసిన డైరెక్టర్లలో మెజారిటీ సభ్యుల ఆమోదం తప్పనిసరి.

చంద్రశేఖరన్ పునర్నియామకం విషయంలో ఈ నిబంధనను పాటించలేదని ట్రస్టులు ఆరోపిస్తున్నాయి.

సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో ట్రస్టుల తరఫున నామినేట్ అయిన నోయెల్ టాటా చంద్రశేఖరన్ పునర్నియామక తీర్మానాన్ని వ్యతిరేకించారు.

మరో ట్రస్ట్ నామినీ వేణు శ్రీనివాసన్ మాత్రం ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. దీంతో ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

వివరాలు 

చంద్రశేఖరన్ పునర్నియామకానికి బోర్డు తీర్మానం చెల్లుబాటు కాదు 

ఈ పరిస్థితుల్లో సమావేశానికి అధ్యక్షత వహించిన స్వతంత్ర డైరెక్టర్ హరీశ్ మన్వానీ తనకు ఉన్న నిర్ణయాత్మక ఓటు (కాస్టింగ్ ఓటు) హక్కును వినియోగించి తీర్మానాన్ని ఆమోదించారు.

అయితే, ఆర్టికల్ 121 ప్రకారం ట్రస్ట్ నామినీ డైరెక్టర్ల మెజారిటీ ఆమోదం తప్పనిసరి అయినప్పుడు.. స్వతంత్ర డైరెక్టర్ వేసిన కాస్టింగ్ ఓటుతో ఆ నిబంధనను అధిగమించలేమని ట్రస్టులు వాదిస్తున్నాయి.

అందువల్ల చంద్రశేఖరన్ పునర్నియామకానికి సంబంధించిన బోర్డు తీర్మానం చెల్లుబాటు కాదని పేర్కొంటున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

న్యాయస్థానానికి చేరిన తాజా పరిణామాలు 

ఈ వ్యవహారంలో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ ద్వారా రూ.50 కోట్లు, రతన్ టాటా ట్రస్ట్ ద్వారా రూ.15 కోట్ల నష్టపరిహారాన్ని కోరుతున్నాయి.

వీటితో పాటు 18 శాతం వడ్డీ కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.

తాజా పరిణామాలతో టాటా సన్స్‌లో ఛైర్మన్ పునర్నియామకంపై నెలకొన్న విభేదాలు న్యాయస్థానం వరకు చేరాయి.

దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన టాటా గ్రూపులో నాయకత్వానికి సంబంధించిన వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT