TCS Porsche: టీసీఎస్ చేతికి మరో ఐటీ సంస్థ.. ఏకంగా రూ. 3500 కోట్లకు జర్మనీ దిగ్గజం పోర్షేతో డీల్..!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరో భారీ కొనుగోలుకు అడుగులు వేస్తోంది. జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే ఏజీకి చెందిన మేనేజ్‌మెంట్,ఐటీ కన్సల్టింగ్ సంస్థ MHPను టీసీఎస్ సొంతం చేసుకోనుంది. MHPలో 100 శాతం ఈక్విటీ వాటాను 320 మిలియన్ యూరోలకు కొనుగోలు చేసేందుకు TCS నెదర్లాండ్స్ బోర్డు ఆమోదం తెలిపింది. భారత కరెన్సీలో ఈ డీల్ విలువ సుమారు రూ.3,572 కోట్లుగా ఉంటుంది. రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ.. కొనుగోలు పూర్తవ్వాలంటే సంబంధిత నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి ఉంది.
వివరాలు
పోర్షేతో రూ.14 వేల కోట్ల వ్యూహాత్మక భాగస్వామ్యం
అవసరమైన అనుమతులు, ఇతర ప్రక్రియలు పూర్తయితే రానున్న 3 నుంచి 4 నెలల్లో ఈ డీల్ పూర్తయ్యే అవకాశం ఉందని టీసీఎస్ వెల్లడించింది.
MHP కొనుగోలుతోనే ఈ ఒప్పందం ముగియడం లేదు. పోర్షే, టీసీఎస్ మధ్య ఐదేళ్లపాటు కొనసాగే వ్యూహాత్మక భాగస్వామ్యానికి కూడా అంగీకారం కుదిరింది.
ఈ భాగస్వామ్యం విలువ 1.25 బిలియన్ యూరోలు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.14 వేల కోట్లకు సమానం.
ఆటోమొబైల్ రంగంలో కృత్రిమ మేధ (AI),సాఫ్ట్‌వేర్, డేటా వినియోగాన్ని మరింత విస్తరించడం ఈ భాగస్వామ్యంలోని ప్రధాన లక్ష్యం.
ఇందులో భాగంగా పోర్షే కోసం టీసీఎస్ ప్రత్యేకంగా'AI మొబిలిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ఏర్పాటు చేయనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీసీఎస్ చేసిన ట్వీట్
We have entered a strategic partnership with Porsche AG to accelerate the future of AI-powered mobility. As part of this collaboration, TCS will acquire MHP, Porsche's management and IT consulting subsidiary, and establish a dedicated AI Mobility Centre of Excellence.
— Tata Consultancy Services (@TCS) August 24, 2026
This… pic.twitter.com/ZcspJC2vC1
వివరాలు
మరి MHP ఏం చేస్తుంది?
తయారీ, కార్యకలాపాలు, ఇంజినీరింగ్, ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్, కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ తదితర విభాగాల్లో ఏఐ వినియోగాన్ని పెంచేందుకు ఈ కేంద్రం పనిచేయనుంది.
జర్మనీలోని లుడ్విగ్స్‌బర్గ్ కేంద్రంగా MHP కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఈ సంస్థ ప్రధానంగా ఐటీ కన్సల్టింగ్, మేనేజ్‌మెంట్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, SAP ట్రాన్స్‌ఫర్మేషన్, సాఫ్ట్‌వేర్ ఆధారిత మొబిలిటీ వంటి సేవలను అందిస్తోంది.
MHPలో ప్రస్తుతం సుమారు 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2025 క్యాలెండర్ సంవత్సరంలో సంస్థ 742 మిలియన్ యూరోల టర్నోవర్ నమోదు చేసింది.
భారత కరెన్సీలో ఇది రూ.8 వేల కోట్లకు పైమాటే. జర్మనీతో పాటు బ్రిటన్, రొమేనియా, అమెరికా, మెక్సికో, భారత్‌లోనూ MHP తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
వివరాలు
ఆటో రంగంలో టీసీఎస్‌కు మరింత బలం
ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా డిజిటల్ మార్పు దిశగా సాగుతోంది.
ఎలక్ట్రిక్ వాహనాలు,ఏఐ ఆధారిత తయారీ వ్యవస్థలు, కనెక్టెడ్ మొబిలిటీ వంటి టెక్నాలజీలు ఈ రంగంలో కీలకంగా మారుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో MHPను కొనుగోలు చేయడం ద్వారా ఆటోమొబైల్, తయారీ రంగాల్లో టీసీఎస్ తన సాంకేతిక సేవలను మరింత విస్తరించే అవకాశం ఉంది.
ముఖ్యంగా జర్మనీతో పాటు యూరప్‌లోని ఆటోమొబైల్, ఇతర పారిశ్రామిక సంస్థలతో టీసీఎస్‌కు ఉన్న సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ కొనుగోలు దోహదపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు MHPను టీసీఎస్‌కు బదిలీ చేయడం ద్వారా తమ ప్రధాన ఆటోమొబైల్ వ్యాపారంపై మరింత దృష్టి పెట్టాలని పోర్షే భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
నష్టాల్లోనే టీసీఎస్ షేరు (TCS Share Price)
టీసీఎస్ వ్యూహాత్మక టెక్నాలజీ భాగస్వామిగా కొనసాగడం వల్ల పోర్షేకు కూడా అదనపు ప్రయోజనాలు లభిస్తాయని భావిస్తున్నారు.
టీసీఎస్ భారీ డీల్ ప్రకటించినప్పటికీ మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేరు నష్టాల్లోనే కొనసాగింది.
సోమవారం టీసీఎస్ షేరు రూ.2,284.10 వద్ద ముగిసింది. మంగళవారం ఉదయం దాదాపు ఒక శాతం లాభంతో రూ.2,305 వద్ద ప్రారంభమైంది.
ఆ తర్వాత షేరు రూ.2,313.50 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. అయితే ఆ స్థాయి నుంచి క్రమంగా ఒత్తిడికి లోనైంది.
వార్త రాసే సమయానికి ఉదయం 10.30 గంటల సమయంలో టీసీఎస్ షేరు 0.50 శాతం నష్టంతో రూ.2,270 స్థాయిలో ట్రేడవుతోంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు రూ.8.23 లక్షల కోట్లుగా ఉంది.