LOADING...
TCS-H-1B Visa: హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో టీసీఎస్‌ కీలక నిర్ణయం.. కొత్త నియామకాలు నిలిపివేత
కొత్త నియామకాలు నిలిపివేత

TCS-H-1B Visa: హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో టీసీఎస్‌ కీలక నిర్ణయం.. కొత్త నియామకాలు నిలిపివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2025
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచాలని తీసుకున్న నిర్ణయం టెక్‌ కంపెనీలలో పెద్ద కలకలం రేపింది. ఈ నిర్ణయం వల్ల సంస్థలపై భారీ ఆర్థిక భారం పడనుంది. ఈ పరిణామాలపై స్పందించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఈఓ కె. కృతివాసన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం హెచ్‌-1బీ వీసా కింద కొత్త నియామకాలు చేపట్టే ఆలోచన లేదని స్పష్టంచేశారు. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పందించారు.

వివరాలు 

11,000 మంది హెచ్‌-1బీ వీసాలతో భారత్‌ నుంచి వెళ్ళినవారే

"అమెరికాలో ఇప్పటికే మాకు సరిపడా హెచ్‌-1బీ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో మా కంపెనీలో 32,000 నుండి 33,000 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 11,000 మంది హెచ్‌-1బీ వీసాలతో భారత్‌ నుంచి వెళ్ళినవారే. ఈ సంవత్సరం మాత్రమే భారత్‌ నుంచి మరో 500 మంది ఉద్యోగులను హెచ్‌-1బీ వీసాలపై అమెరికాకు పంపించాం. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త హెచ్‌-1బీ నియామకాలు చేయాలనే ప్రణాళిక లేదు. బదులుగా, స్థానిక అమెరికన్‌ ఉద్యోగులను నియమించడంపైనే దృష్టి పెడతాం. హెచ్‌-1బీ వీసా ఉద్యోగులపై ఆధారాన్ని క్రమంగా తగ్గించాలన్నది మా లక్ష్యం. అలాగే, మాకు ఎల్‌-1 వీసాల సదుపాయమూ ఉంది, కానీ అవి పూర్తిగా హెచ్‌-1బీకి ప్రత్యామ్నాయంగా నిలవలేవు" అని కృతివాసన్‌ వెల్లడించారు.

వివరాలు 

 2 శాతం ఉద్యోగులను తొలగించిన అంశంపై..

ఇక, ఇటీవల టీసీఎస్‌లో దాదాపు 2 శాతం ఉద్యోగులను తొలగించిన అంశంపై కూడా ఆయన స్పందించారు. కంపెనీ భవిష్యత్‌ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కృతివాసన్‌ పేర్కొన్నారు. తొలగింపులకు గురైన ఉద్యోగులకు మెరుగైన పరిహార ప్యాకేజీని అందించామని వివరించారు. ఇక టీసీఎస్‌ భవిష్యత్‌ ప్రణాళికల గురించి మాట్లాడుతూ, కంపెనీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) డేటా సెంటర్ల అభివృద్ధికి దాదాపు 7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కృతివాసన్‌ వెల్లడించారు.

వివరాలు 

హెచ్‌-1బీ ఉద్యోగులను అత్యధికంగా నియమించుకున్న కంపెనీలలో  అగ్రస్థానంలో టీసీఎస్

అమెరికాలో హెచ్‌-1బీ ఉద్యోగులను అత్యధికంగా నియమించుకున్న కంపెనీలలో టీసీఎస్‌ అగ్రస్థానంలో ఉంది. 2009 నుంచి 2025 మధ్యకాలంలో 98,259 మంది హెచ్‌-1బీ ఉద్యోగులను నియమించుకుంది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 5,505 మంది కొత్త హెచ్‌-1బీ ఉద్యోగులను తీసుకుంది.