Elon Musk: 75% వాటాదారుల మద్దతుతో.. ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీతో మస్క్‌కు నూతన రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలాన్ మస్క్ మరోసారి చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. టెస్లా కంపెనీ సీఈవో అయిన ఆయనకు ట్రిలియన్ డాలర్ల విలువైన భారీ వేతన ప్యాకేజీ మంజూరు చేసేందుకు వాటాదారులు సమ్మతించారు. ఈ పరిణామంతో త్వరలోనే మస్క్ ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్‌గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురువారం టెస్లా వార్షిక షేర్ హోల్డర్స్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మస్క్‌కి భారీ స్థాయి ప్యాకేజీ ఇవ్వాలని ప్రతిపాదించగా, అందులో 75 శాతం మందికి పైగా వాటాదారులు తమ మద్దతును ప్రకటించినట్లు సమాచారం. ఈ ప్యాకేజీ ప్రకటన వెలువడిన అనంతరం మస్క్ ఆనందంలో మునిగిపోయారు. వేదికపై రోబోతో కలిసి డ్యాన్స్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
వివరాలు
మస్క్ కనీసం సుమారు 7.5 సంవత్సరాలు టెస్లాలో కొనసాగేందుకు ఈ ప్యాకేజీ ఏర్పాటు
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు మద్దతు తెలిపిన ప్రతి షేర్ హోల్డర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వారి విశ్వాసం,సహకారం తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా, ఈ ప్రకటన వెలువడిన వెంటనే టెస్లా షేర్ల విలువ పెరిగిందని రాయిటర్స్ సమాచారం. ఇదే సమయంలో, మస్క్ కనీసం సుమారు 7.5 సంవత్సరాలు టెస్లాలో కొనసాగేందుకు ఈ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
టెస్లాలో మస్క్ వాటా 25 శాతం వరకు పెరిగే అవకాశం
ఈ ప్రతిపాదన మొదటగా సెప్టెంబర్‌లో వచ్చినప్పుడు టెస్లాలో మస్క్ వాటా 12 శాతం ఉండగా, ఇప్పుడు అది 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆయనకు రోజువారీ వేతనం 237 మిలియన్ డాలర్ల వరకు చేరుకునే పరిస్థితి ఉంది. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో ప్రకటించిన అతి పెద్ద వేతన ఒప్పందంగా నిలవనుంది. అదే సమయంలో, ప్యాకేజీ పెంపుపై టెస్లా బోర్డు వాటాదారులకు ముఖ్యమైన హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే, మస్క్ కంపెనీ నుంచి తప్పుకోవచ్చని బోర్డు స్పష్టంగా పేర్కొంది.