Tesla SpaceX merger: టెస్లా-స్పేస్‌ఎక్స్ విలీనం.. ఎలాన్ మస్క్‌కు 110 బిలియన్ డాలర్ల లాభం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద భారీగా పెరిగే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అంచనా వెల్లడించింది. టెస్లా (Tesla), స్పేస్‌ఎక్స్ (SpaceX)విలీన ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.. మస్క్ సంపదకు 110 బిలియన్ డాలర్లకు పైగా (భారత కరెన్సీలో సుమారు రూ.9 లక్షల కోట్లకు పైగా) విలువ జతకావచ్చని తెలిపింది. 2028లో వెస్ట్ కావాల్సిన టెస్లా షేర్లు విలీనం కారణంగా ముందుగానే ఆయనకు దక్కే అవకాశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా మస్క్‌కు టెస్లా ఇటీవల ప్రకటించిన భారీ పరిహార ప్యాకేజీ ద్వారా కూడా బిలియన్ల డాలర్ల విలువైన అదనపు ప్రయోజనాలు లభించవచ్చని అంచనా. అయితే ఇవన్నీ విలీనం జరిగే విధానం, ఒప్పందంలోని నిబంధనలపై ఆధారపడి ఉంటాయి.
వివరాలు
ప్రత్యేక కమిటీలు ఏర్పాటు
టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థలు విలీన అవకాశాలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు మస్క్ స్వయంగా వెల్లడించారు.
స్పేస్‌ఎక్స్ ఆదాయాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
'మనం ఇప్పటికే సూపర్ ఇంటెలిజెన్స్ సింగ్యులారిటీ దశలో ఉన్నాం. రెండు సంస్థలు పరస్పరం సహకరించుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందవచ్చని మస్క్ వ్యాఖ్యానించారు.
అయితే ఈ విలీన ప్రతిపాదనతో పలు కీలక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
విలీనం జరిగితే టెస్లా వాటాదారులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? మస్క్ వేతనం, పరిహార ప్యాకేజీలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? వంటి అంశాలపై చర్చ జరుగుతోంది.
వివరాలు
విలీనంతో మస్క్‌కు 110 బిలియన్ డాలర్లు ఎలా దక్కుతాయి?
బ్లూమ్‌బర్గ్ వివరాల ప్రకారం.. విలీనం వంటి నియంత్రణ మార్పు (Change-in-control) పరిణామం చోటుచేసుకుంటే, గతంలో మస్క్‌కు కేటాయించిన సుమారు 286 మిలియన్ టెస్లా షేర్లు ముందుగానే వెస్ట్ కావచ్చు.
ప్రస్తుతం ఈ షేర్ల విలువ 110 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. అయితే, ఈ షేర్లు ఇంకా పూర్తిగా ఆయనకు దక్కలేదు కాబట్టి, ప్రస్తుతం ఆయన నికర సంపద లెక్కింపులో వాటిని చేర్చలేదు.
మస్క్‌కు గతంలో ఇచ్చిన భారీ పరిహార ప్యాకేజీని 'మూన్‌షాట్ పే ప్యాకేజీ'గా పిలుస్తారు.
దీని కింద టెస్లా మార్కెట్ విలువ, కార్యకలాపాలకు సంబంధించిన నిర్దిష్ట లక్ష్యాలను చేరుకుంటే మస్క్‌కు సుమారు 304 మిలియన్ స్టాక్ ఆప్షన్లు లభించేలా ఒప్పందం కుదిరింది.
ఆ ప్యాకేజీలోని అన్ని లక్ష్యాలను టెస్లా చేరుకుంది.
వివరాలు
నగదు భారాన్ని తగ్గించేలా షేర్ల రూపంలోనే లెక్కలు
దీని ప్రకారం, ఆప్షన్లను వినియోగించుకునేందుకు, పన్నులు చెల్లించేందుకు అవసరమైన నగదు భారాన్ని తగ్గించేలా షేర్ల రూపంలోనే లెక్కలు సర్దుబాటు చేసుకునే అవకాశం కల్పించారు.
అయితే ఈ విధానం ద్వారా మస్క్‌కు లభించిన సుమారు 286 మిలియన్ షేర్లు 2028 జనవరి వరకు వెస్ట్ కావు. అప్పటివరకు ఆయన సంస్థలో కొనసాగేందుకు ప్రోత్సాహకంగా ఈ నిబంధనను చేర్చారు.
కానీ, ఈ ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం.. సంస్థపై నియంత్రణ మార్పు జరిగితే ఆ షేర్లు వెంటనే వెస్ట్ అయ్యే అవకాశం ఉంది.
టెస్లా-స్పేస్‌ఎక్స్ విలీనం ఈ నిబంధనకు వర్తిస్తే, మస్క్‌కు 110 బిలియన్ డాలర్లకు పైగా విలువైన షేర్లు ముందుగానే దక్కవచ్చని బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది.
వివరాలు
కొత్త పరిహార ప్యాకేజీతోనూ భారీ ప్రయోజనాలు?
మస్క్‌కు 2025లో ప్రకటించిన మరో టెస్లా పరిహార ప్యాకేజీ కూడా విలీనం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
ఈప్యాకేజీలోని అన్ని లక్ష్యాలను ఆయన సాధిస్తే దాని మొత్తం విలువ దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ వరకు ఉండవచ్చని అంచనా.
ఈ ప్యాకేజీలో భాగంగా టెస్లా 20 మిలియన్ వాహనాలను డెలివరీ చేయడం, ఒక మిలియన్ రోబోటాక్సీలను వాణిజ్య కార్యకలాపాల్లోకి తీసుకురావడం, ఒక మిలియన్ ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోలను డెలివరీ చేయడం వంటి లక్ష్యాలు ఉన్నాయి.
అయితే విలీనం వల్ల ఈ పరిహార ప్యాకేజీలోని నియంత్రణ మార్పు నిబంధనలు అమల్లోకి వస్తే.. కార్యకలాపాలకు సంబంధించిన లక్ష్యాలను పక్కనపెట్టి, ఒప్పందంలో టెస్లాకు నిర్ణయించే మార్కెట్ విలువ ఆధారంగా మస్క్‌కు లభించే పరిహారాన్ని లెక్కించే అవకాశం ఉంటుంది.
వివరాలు
టెస్లా వాటాదారులకు ఏమి దక్కుతుంది?
ఉదాహరణకు, విలీన ఒప్పందంలో టెస్లా విలువ రెండు ట్రిలియన్ డాలర్లుగా నిర్ణయిస్తే.. అది మస్క్ పరిహార ప్యాకేజీలోని తొలి మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష్యం.
అప్పుడు ఆయనకు నికరంగా ఆరు బిలియన్ డాలర్లకు పైగా విలువైన షేర్లు దక్కవచ్చని అంచనా. ప్రస్తుతం టెస్లా మార్కెట్ విలువ సుమారు 1.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
విలీనం వల్ల వాటాదారులకు కలిగే ప్రయోజనాలు, ఒప్పందం ఏ రూపంలో అమలవుతుందనే దానిపై ఆధారపడి ఉంటాయి.
విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో లేదా దాని మాతృసంస్థలో ప్రస్తుత టెస్లా వాటాదారుల ఓటింగ్ హక్కులు 50 శాతం కంటే తక్కువకు పడిపోతే, నియంత్రణ మార్పునకు సంబంధించిన నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
వివరాలు
విలీన నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది
అయితే ఈ నిబంధనలు సాంకేతికంగా వర్తిస్తాయా లేదా అనేది విలీన నిర్మాణంపై ఆధారపడి ఉంటుందని జేసన్ ష్లోట్జర్ తెలిపారు.
విలీన ప్రతిపాదనలో సంస్థల విలువను ఎలా నిర్ణయిస్తున్నారు? మస్క్‌కు లభించే ప్రయోజనాలపై ప్రత్యేక కమిటీలు ఎలా స్పందిస్తున్నాయి? వంటి అంశాలను రెండు సంస్థల వాటాదారులు జాగ్రత్తగా పరిశీలించాలని ఆయన సూచించారు.
ఈ విలీన ప్రతిపాదనపై స్పందన కోరుతూ సంప్రదించగా, టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థలు వ్యాఖ్యానించలేదు.
విలీనం జరిగితే స్పేస్‌ఎక్స్ తరఫున మస్క్‌కు అందించే పరిహార ప్యాకేజీలను కూడా సవరించే అవకాశం ఉంది
వివరాలు
విలీనం తర్వాత మస్క్‌కు మరో భారీ ప్యాకేజీ?
గతంలో ఈ రెండు సంస్థలు భారీ మొత్తంలో ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలను అందించిన నేపథ్యంలో, మస్క్ కోసం కొత్త పరిహార ప్యాకేజీ రూపొందించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోందని జేసన్ ష్లోట్జర్ అభిప్రాయపడ్డారు.
మస్క్ సంస్థలో చురుకుగా కొనసాగేందుకు కొత్త షేర్లు లేదా ఇతర ప్రోత్సాహకాలు అవసరమని విలీనానంతరం ఏర్పడే సంస్థ బోర్డు వాదించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
మొత్తంగా, టెస్లా-స్పేస్‌ఎక్స్ విలీనం మస్క్ సంపద, పరిహార ప్యాకేజీలపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు.
అయితే ఆయనకు ఎంత మేరకు ప్రయోజనం కలుగుతుంది? వాటాదారులకు ఎలాంటి ప్రతిఫలం లభిస్తుంది? అనే అంశాలపై స్పష్టత రావాలంటే విలీన ఒప్పంద నిర్మాణం, తుది నిబంధనలు వెల్లడికావాల్సి ఉంది.