LOADING...
Tesla: టెస్లా భారీ నిర్ణయం.. AI, రోబోటిక్స్‌కు $25B బిలియన్ పెట్టుబడి
టెస్లా భారీ నిర్ణయం.. AI, రోబోటిక్స్‌కు $25B బిలియన్ పెట్టుబడి

Tesla: టెస్లా భారీ నిర్ణయం.. AI, రోబోటిక్స్‌కు $25B బిలియన్ పెట్టుబడి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా తన భవిష్యత్ లక్ష్యాల దిశగా భారీ నిర్ణయం తీసుకుంది. 2026 సంవత్సరానికి క్యాపిటల్ ఖర్చును 25 బిలియన్ డాలర్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది. గత కొన్ని సంవత్సరాల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. 2025లో 8.5 బిలియన్, 2024లో 11.3 బిలియన్, 2023లో 8.9 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేసింది. కంపెనీని కేవలం ఎలక్ట్రిక్ కార్లకు పరిమితం కాకుండా AI, రోబోటిక్స్ రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే ఈ భారీ పెట్టుబడి లక్ష్యం. ఈ నిధులను ముఖ్యంగా డేటా సెంటర్లు, కంప్యూటింగ్ మౌలిక వసతులు, తయారీ విస్తరణ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం వినియోగించనుంది.

వివరాలు 

కీలక రంగాల్లో పెట్టుబడి

కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ఈ నిర్ణయాన్ని భవిష్యత్‌పై పెట్టుబడిగా పేర్కొన్నారు. 2026లో పెట్టుబడులను గణనీయంగా పెంచుతామని, ఆదాయ వనరులు కూడా పెరుగుతాయని ఆయన తెలిపారు. ఇదే సమయంలో ఇతర టెక్ దిగ్గజాలు కూడా భారీగా ఖర్చు పెంచుతున్నాయని చెప్పారు. Amazon 200 బిలియన్ డాలర్లు, Google 175 నుంచి 185 బిలియన్ డాలర్ల మధ్య పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నాయి. టెస్లా ఈ నిధులతో బ్యాటరీ టెక్నాలజీ, AI సాఫ్ట్‌వేర్, చిప్ డిజైన్, AI ట్రైనింగ్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడి పెడుతోంది.

వివరాలు 

భారీ స్థాయిలో Optimus హ్యూమనాయిడ్ రోబోట్‌ తయారీ 

అలాగే రోబోటాక్సీ ప్రాజెక్టులు, ఆస్టిన్‌లో సెమీకండక్టర్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఫ్రీమాంట్ ఫ్యాక్టరీలో Optimus హ్యూమనాయిడ్ రోబోట్‌ను భారీ స్థాయిలో తయారు చేయనుంది. ఇప్పటికే ఆస్టిన్ వద్ద ప్రత్యేక ఫ్యాక్టరీకి స్థలం కూడా సిద్ధం చేసింది. రాబోయే కాలంలో ఈ రోబోట్లు కంపెనీ బయట కూడా ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సరఫరా వ్యవస్థను కూడా బలోపేతం చేస్తూ బ్యాటరీలు, ఎనర్జీ, AI చిప్‌ల రంగాల్లో మరింత దృష్టి సారిస్తోంది.

Advertisement