
2023లో ఘాటెక్కిన వంటిల్లు.. భారీగా పెరిగిన మసాలా దినుసుల ధరలు.. కారణం ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
2023లో ద్రవ్యోల్బణం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా వంటగదిపై దీని ప్రభావం ఎక్కువనే చెప్పాలి.
ఈ ఏడాది ద్రవ్యోల్బణం వల్ల రోజూ వంటల్లో వినియోగించే జీలకర్ర, పసుపు, మిర్చి, మిరియాలు, ఇతర మసాలా దినుసుల ధరలు విపరీతంగా పెరిగాయి.
2023లో జులై నుంచి ఇప్పటి వరకు సుగంధ ద్రవ్యోల్బణం 22 శాతం పెరగడం గమనార్హం.
దీనివల్ల మసాలా దినుసులు కొనడం సామాన్యుడికి భారంగా మారుతున్న పరిస్థితి నెలకొంది.
రానున్న కాలంలో ఉల్లి, టమాటా మాదిరిగానే సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ద్రవ్యోల్బణం
ధరలు ఎందుకు పెరిగాయంటే..
పంట విస్తీర్ణం తగ్గడమే కాకుండా తెగుళ్ల బెడద కారణంగా దిగుబడిపై ప్రభావం వల్ల మసాలా దినుసుల ధరలు పెరుగుతున్న పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం ఉన్న 22శాతం సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణ ప్రభావం.. డిసెంబర్- మార్చి మధ్య గల రిటైల్ ద్రవ్యోల్బణానికి అదనంగా 0.6 శాతం పాయింట్లను జోడిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంకో విషయం ఏంటంటే.. మసాలా దినుసుల ధరలు తదుపరి పంట దిగుబడి వచ్చే వరకు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది.
మాసాలా దినుసులను తక్కువగా అంచనా వేయొద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వీటి ధరలు పెరగడం వల్ల వాటిని వినియోగించే ఆహార ఉత్పత్తులు, జామ్‌లు, మిఠాయిలు, ఇతర ఉత్పత్తుల ధరలపై భారీ మొత్తంలో ప్రభావం చూపుతాయని అంటున్నారు.