Loading...
AI: ఏఐ స్పీడుకు కళ్లెం వేయాల్సిన టైమొచ్చింది.. టెక్‌ దిగ్గజాల కీలక హెచ్చరిక!
ఏఐ స్పీడుకు కళ్లెం వేయాల్సిన టైమొచ్చింది.. టెక్‌ దిగ్గజాల కీలక హెచ్చరిక!

AI: ఏఐ స్పీడుకు కళ్లెం వేయాల్సిన టైమొచ్చింది.. టెక్‌ దిగ్గజాల కీలక హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2026
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ(Artificial Intelligence)శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. రానున్న పదేళ్లలో 10 శాతానికి పైగా మనుషులు ఏఐ కారణంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఆంథ్రోపిక్‌కు చెందిన పరిశోధకుడు ఇవాన్‌ హుబింగర్‌(Evan Hubinger)ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆంథ్రోపిక్‌ సీఈవో డారియో అమోడెయ్ (Dario Amodei) కూడా కృత్రిమ మేధతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఏఐ అభివృద్ధి వేగానికి (AI race) ఇకనైనా కళ్లెం వేయాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐ సామర్థ్యాలను పెంచే వేగాన్ని తగ్గించాలని కంపెనీలను కోరారు. ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman), ఎక్స్‌ఏఐ అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సైతం డారియో అమోడెయ్ అభిప్రాయానికి మద్దతు పలికారు.

వివరాలు

స్వయంగా మెరుగుపడుతున్న ఏఐ వ్యవస్థలు

స్వయంగా తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకునే సూపర్‌ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలను రూపొందిస్తున్న నేపథ్యంలో.. ఏఐ వ్యవస్థల్లో తమను తాము మెరుగుపరుచుకునే సామర్థ్యం పెరుగుతోందని డారియో ఆందోళన వ్యక్తం చేశారు.

అదే సమయంలో కృత్రిమ మేధకు చెందిన ఏజెంట్లు బాహ్య వ్యవస్థలను యాక్సెస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయాలను ఆయన గుర్తు చేశారు.

ఏఐని ఇలాగే ఎలాంటి నియంత్రణ లేకుండా వదిలేస్తే.. అది త్వరలోనే స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవస్థలను సృష్టించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మరో 6-12 నెలల్లో ఆ సమూహం మొత్తం ఇంటర్నెట్‌ను స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందని డారియో పేర్కొన్నారు.

అదే జరిగితే కొన్ని వందల బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

వివరాలు

సాంకేతిక పురోగతిని పూర్తిగా ఆపొద్దు

అయితే తాను సాంకేతిక పురోగతిని పూర్తిగా నిలిపివేయాలని చెప్పడం లేదని డారియో స్పష్టం చేశారు. దానికి బదులుగా కంపెనీలు తమ ఏఐ మోడళ్ల భద్రతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసేందుకు ఏఐ కంపెనీలకు అదనపు సమయం అవసరమని ఆయన పేర్కొన్నారు.

కృత్రిమ మేధ అభివృద్ధి వేగానికి బ్రేకులు వేసేందుకు మూడు దశల ప్రణాళిక (THREE-STEP PLAN)ను వివరించారు.

ఇదిలా ఉండగా.. ఇరాన్‌కు మద్దతు ఇస్తున్న యెమెన్‌లోని హూతీలు (Houthis) క్షిపణులను అభివృద్ధి చేసేందుకు తమ ఏఐ చాట్‌బాట్‌ క్లాడ్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆంథ్రోపిక్‌ (Anthropic) ఇటీవల తన నివేదికలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో డారియో అమోడెయ్ తాజాగా చేసిన హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

డారియో సూచించిన పరిష్కారాలు..

1. స్వతంత్ర భద్రతా నిపుణుల నియామకం

ఏఐ వినియోగంలో భద్రతను ధ్రువీకరించేందుకు కంపెనీల్లో నిరంతరం పర్యవేక్షించే స్వతంత్ర భద్రతా నిపుణులను నియమించాలి.

2. ఏఐ సంస్థల మధ్య సమన్వయం

భద్రతా ప్రమాణాలను నెలకొల్పడంతో పాటు అనియంత్రిత అభివృద్ధిని నిరోధించేందుకు అగ్రగామి ఏఐ సంస్థల మధ్య సమన్వయం ఉండాలి.

3. ప్రపంచ దేశాల మధ్య సహకారం

శక్తిమంతంగా మారుతున్న ఏఐ వ్యవస్థల వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించి, వాటిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించాలి.

ADVERTISEMENT