Anand Mahindra: చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ మారడం అవసరం : ఆనంద్ మహీంద్రా
నూతన సంవత్సరం వేళ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర(Anand Mahindra) స్ఫూర్తిని నింపే సందేశాన్ని ఇచ్చారు. చైనా అధిపత్యానికి భారత్ ప్రత్యామ్నాయంగా మారాలని ఆయన స్పష్టం చేశారు. చైనా సరఫరా గొలుసు ఆధిపత్యాన్ని సవాల్ చేసేలా భారత్ నిలవడం ఈ ప్రపంచానికి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. జనవరి 1 అంటే కేవలం క్యాలెండర్ మారే తేదీ మాత్రమే కాదని, ఇది చాలా ప్రత్యేకమని, గతేడాది ఎంత చీకటిగా గడిచినా భవిష్యత్తు కోసం ఆశాజనకంగా ఉండే సామర్థ్యం అందరికి ఉందన్నారు. ఈ ఏడాది యుద్ధాలు, వాతావరణ మార్పుల సంవత్సరంగా నిలిచిందన్నారు.
గతేడాది అనేక విజయాలను సాధించాం
భారత్ తయారీ రంగం అద్వితీయ ఘనత సాధించే అవకాశం మనపైనే ఆధారపడి ఉందని, దాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకోవాలని ఆనంద్ మహేంద్ర చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తయారీ, ఎగుమతులు పెరిగితే వినియోగ రంగం కూడా పెరుగుతుందన్నారు. గతేడాది అనేక సవాళ్లను ఎదుర్కొని భారత్ ఆసాధారణ విజయాలను సాధించిందని ఆయన కొనియాడారు. 2024లో మన దేశంలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.