Starlink Subscription Price: స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం నెలసరి ఛార్జీలు ఇవే.. తగ్గిన ధరలు, ఫ్రీ ట్రయల్ ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్ (Elon Musk) స్థాపించిన స్పేస్‌ఎక్స్ అనుబంధ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సంస్థ స్టార్‌లింక్ (Starlink) భారత మార్కెట్‌లో కమర్షియల్ సేవల ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత్‌లో అందించనున్న మొదటి రెసిడెన్షియల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరను అధికారికంగా వెల్లడించింది. సంబంధిత వివరాలను స్టార్‌లింక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం రెసిడెన్షియల్ ప్లాన్ నెలవారీ చార్జీ రూ. 8,600, దీనికి అదనంగా హార్డ్‌వేర్ కోసం రూ. 34,000 చెల్లించాలి. వినియోగదారులకు అపరిమిత డేటా లభిస్తుందని సంస్థ స్పష్టంచేసింది. సేవ ప్రారంభించిన తర్వాత 30 రోజుల ఫ్రీ ట్రయల్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది.
Details
ఇంటర్నెట్ స్పీడ్ వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు
స్టార్‌లింక్ సేవలు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ నిరంతరాయంగా పనిచేస్తాయని, అలాగే వినియోగదారులే సులభంగా అమర్చుకునేలా ప్లగ్-అండ్-ప్లే డివైస్‌గా రూపొందించామని పేర్కొంది. సేవల ఇంటర్నెట్ స్పీడ్ వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. బిజినెస్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. భారతదేశంలో పూర్తి స్థాయి సేవలు అందించడానికి నియంత్రణ సంస్థల అనుమతులు ఇంకా అవసరమని వెబ్‌సైట్‌లో పేర్కొంది. మరోవైపు స్టార్‌లింక్ మ్యాప్‌లో బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక వంటి పొరుగుదేశాల్లో సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు చూపించింది. దేశవ్యాప్త విస్తరణలో భాగంగా కంపెనీ భారత్‌లో రిసోర్స్ హైరింగ్‌ను ప్రారంభించింది. అలాగే హైదరాబాద్, చండీగఢ్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నొయిడా వంటి ప్రధాన నగరాల్లో గేట్‌వే ఎర్త్ స్టేషన్‌లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించిందని సమాచారం.